చేవెళ్ల రూరల్ : కంకరతో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంతోనే మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. టిప్పర్ బస్సును ఢీకొట్టి దాదాపు 40 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో కుడి వైపు కూర్చున్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు మలుపు ఉన్నా ప్రమాదం జరిగేంత టర్నింగ్ లేదన్నారు.
దీనికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కనిపిస్తుందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన టిప్పర్ కండీషన్‌ను మెకానిక్ ద్వారా పరిశీలిస్తున్నామని, టిప్పర్ ఓనర్ లక్ష్మణ్‌నాయక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వచ్చే నెల నుంచి అరైవల్ పేరుతో నూతనంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. డీజీపీ వెంట సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, పోలీసు అధికారులు ఉన్నారు.