మొయినాబాద్, మే 14 : విద్యుత్ అధికారుల నిండు నిర్లక్ష్యంతో చిన్నారుల నిండు ప్రాణాల మీదికి వచ్చింది. రోడ్డు పక్కన ఇనుప రాడ్లపై విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. చిన్నారులు ఆడుకుంటూ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైపు వెళ్లి ఇనుప రాడ్లను పట్టుకున్నారు. దీంతో చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురై తృటిలో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలో 2వ వార్డులోని ముస్లిం శ్మశానవాటికకు సంబంధించి రోడ్డు పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినప్పుడు సిమెంట్, గ్రానైట్‌తో దిమ్మను నిర్మించలేదు. కేవలం ఇనుప రాడ్లను భూమిలో బిగించి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన బైండ్ల జైపాల్ ఇద్దరు పిల్లలు, బీహార్‌కు చెందిన లక్ష్మణ్ కూతురు ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్ వైపు వెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ను బిగించిన రాడ్లను పట్టుకోగా ముగ్గురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గోపాల్ కూతురుకు తలకు తీవ్ర గాయం కాగా, బాబుకు కాలుకు, ముఖానికి తీవ్ర గాయాలైనాయి. బీహర్‌కు చెందిన లక్ష్మణ్ కూతురుకు విద్యుత్ షాక్ తగిలి చేతులు కాలిపోయాయి. చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

స్పందించే నాథుడే కరువయ్యాడు
సంఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు స్పందించే నాథుడే కరువయ్యాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు ముగ్గురు పిల్లలు గురై తీవ్రగాయాలపాలయ్యారని.. శాఖాపరంగా ఏదైనా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సంబందిత విద్యుత్ ఏఈని కోరాడు. శాఖాపరంగా సహాయం అందడం చాలా కష్టమని, వ్యక్తిగతంగా సాయం చేస్తానని ఏఈ చెప్పాడు. కాని సంఘటన జరిగి నాలుగు రోజులైనా సదరు అధికారి నుంచి ఎలాంటి సహాయం క్షతగాత్రులకు అందలేదు. అదేవిధంగా 2వ వార్డుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ బేగంబీ ఇప్పటివరకు సంఘటనపై స్పందించిన దాఖలాలు లేవు. అటూ అధికారులుకాని, ఇటు ప్రజాప్రతినిధులుకాని ఎవరూ స్పందించకపోవడం శోచనీయమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిండు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు. దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ అధికారులు వహించాలని డిమాండ్ చేస్తున్నారు.