పరిగి, మార్చి 10 : లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న వారిలో రూ.10,000 చెల్లించిన వారు పరేషాన్లో ఉన్నారు. డీటీసీపీ ఆమోదించిన లేఅవుట్లు కాకుండా గ్రామపంచాయతీ ఆమోదించిన, ఆమోదించని లే అవుట్లలోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే 2019లో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ఎల్ఆర్ఎస్ 2019 వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది.
ప్రతి దరఖాస్తుదారుడు రూ.10,000 చెల్లించాలని సూచించింది. దరఖాస్తు ఫీజు అధికంగా ఉండడంతో అప్పట్లో తక్కువ మొత్తంలోనే దరఖాస్తులు వచ్చాయి. పరిగి మున్సిపాలిటీ నుంచి 1,250 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అప్లికేషన్లు తక్కువగా రావడంతో ప్రభుత్వం ఆ ఫీజును రూ. వెయ్యిగా నిర్ణయించగా.. పరిగి మున్సిపాలిటీ పరిధిలో 3,069 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే లేఅవుట్లో రిజిస్ట్రేషన్ చేయగా మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించి లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం 29 దరఖాస్తులు వచ్చినట్లు సమాచా రం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ ఎలాంటి ఫీజు లేకుండానే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేసింది.
అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ఖజానా నింపుకోవాలనే ఏకైక లక్ష్యంతో దరఖాస్తుదారుల నుంచి ఫీజు వసూలు చేయాలని సంకల్పించింది. ఇందుకు మార్చి 31వ తేదీ లోపు చెల్లిస్తే 25శాతం రా యితీ అని ప్రకటించింది. కాగా, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయి చెల్లింపుల కోసం అధికారులను సంప్రదిస్తున్నా రు. పరిగిలో ఇప్పటివరకు 60 మంది వరకు చెల్లించినట్లు సమాచారం. లే అవుట్ రెగ్యులరైజేషన్‌లో భాగంగా ఎనిమిది లే అవుట్లు ఆన్లైన్ పూర్తైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మా ప్లాట్లనూ క్రమబద్ధీకరించండి..
ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్వయంగా సిబ్బంది ఫోన్లు చేసి మరీ వెంటనే ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రూ. వెయ్యి ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా రూ.10 వేలు చెల్లించిన వారి ప్లాట్ల ఎల్ఆర్ఎస్ పై ఇప్పటివరకు ఎలాం టి స్పష్టత లేకపోవడం గమనార్హం. 2019లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆ సైట్ క్లోజ్ అయిందని, మిగతా వివరాలు తమకు తెలియవని, ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై పలువురు దరఖాస్తుదారులు అధికారులను కలిసినా ఫలితం లేదు. దీంతో రూ.10,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు పరేషాన్లో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అం శంపై తగిన చర్యలు తీసుకొని 2019లో రూ.10 వేలు చెల్లించిన వారి ప్లాట్లను క్రమబద్ధీక రించాలని కోరుతున్నారు.
రూ. 10వేలు చెల్లించి దరఖాస్తు చేశా
ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం 2019 లో రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నా. ఇటీవ ల ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమ బద్ధీకరణ ప్రక్రియ ను ప్రారంభించగా రూ. వెయ్యి చెల్లించిన వారి ప్లాట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. రూ. 10 వేలు చెల్లించిన వారి ప్లాట్ల రెగ్యులరైజేషన్ మాత్రం జరుగడం లేదు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని తన ప్లాట్‌ను క్రమ బద్ధీకరించాలి. -ఎం.సతీశ్‌కుమార్, పరిగి