చేవెళ్ల రూరల్, మే 7 : చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతున్నది. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరారు.తనకు ప్రత్యర్థిగా ఉన్న నియోజకవర్గ భీంభరత్ యాదయ్య కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరక రెండు వర్గాలుగా విడిపోయినట్టు స్థానికంగా చర్చ జరుగు తున్నది.. తాజాగా బుధవారం చేవెళ్ల మున్సిపల్ పరిధి ఇబ్రహీంపల్లి వార్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ శివసేన రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదర్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి భీం భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య రాకపోవడం గమనార్హం. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి భీం భరత్ వర్గం మాత్రమే హాజరైంది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో భీం భరత్ వర్గానికి స్థానం ఇవ్వలేదని, ఎమ్మెల్యే అనుచరులు, బీజేపీ నాయకులకే కమిటీలో ఉన్నారని పలువురు నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు, సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కష్టపడిన వారిని గుర్తిస్తామని వారిని శాంతింపజేశారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతర్గత కలహాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఏదేమైనా స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్చార్జితో మీటింగ్ ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.