రంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 సీట్లు సాధించడంతో క్యాడర్ జోష్‌లో ఉన్నది. మిగిలిన రెండు విడతల్లోనూ అధిక స్థానాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందు అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారన్నది గురువారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. రెండో విడతలో 174 పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల్లో సుమారు 100కు పైగా సీట్లు సాధించాలని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రెండో విడతపై ప్రత్యేక దృష్టి
షాద్‌నగర్ నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫరూఖ్‌నగర్ మండలంలో 18, నందిగామలో 11, చౌదరిగూడలో 13, కొందుర్గులో 8, కేశంపేటలో 12, కొత్తూరులో 3 చొప్పున బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలకు కైవసం చేసుకున్నది. ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ అధిక సీట్లు సాధించడంపై కార్యకర్తలు, నాయకులు ఊపుమీదున్నారు. అలాగే, రెండో విడతలోనూ అధిక సీట్లు దక్కించుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగనున్న మూడో విడతలో అధిక సీట్లు సాధించుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.