రంగారెడ్డి, నవంబర్ 12(నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డిజిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు పాతర వేస్తుండటంతో జిల్లా పరిధిలో టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ గాడి తప్పుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డిజిల్లాలో 13 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్లను మున్సిపాలిటీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో టౌన్‌ప్లానింగ్ వ్యవస్థనే అతికీలకమైనది.
కానీ, ఈ వ్యవస్థలో కొంతమంది అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికుల నుంచి ఆరోపణలొస్తున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులు సమకూర్చటంలో టౌన్‌ప్లానింగ్ విభాగమే కీలకమైంది. కానీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటంతో పాటు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయనే విమర్శలున్నాయి.
రంగారెడ్డిజిల్లాలోని శివారు మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయి. మరోవైపు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకుండానే షాపింగ్ కాంప్లెక్స్‌లు, గోదాములు కూడా యథేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు కూడా టౌన్‌ప్లానింగ్ అధికారుల అండదండలున్నాయని ఆరోపణలొస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
వేధిస్తున్న టీపీఓల కొరత..
జిల్లాలో టీపీఓల కొరత వేధిస్తున్నది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, రాజేంద్రనగర్, శంకర్పల్లి, నార్సింగి, ఆమనగల్లు, షాద్‌నగర్, శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, మణికొండ మున్సిపాలిటీలున్నాయి. అలాగే, బండ్లగూడ జాగీర్, బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లున్నాయి. వీటిలో ఒక్కొక్క టీపీఓకు రెండు నుంచి మూడింటికి ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుండగా 8 నుంచి 10మంది మాత్రమే టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లున్నారు. వీరికి అదనపు బాధ్యతలుండటంతో వారు సమర్థవంతంగా పని చేయటంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల కోసం విల్ నౌ ఆప్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
టీపీబీ, టీపీఎస్, టీపీఓ, వంటి క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించిన మీదటనే తుది అనుమతి కోసం కమిషనర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ, వీటిలో అధికారులెవరు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లకుండానే అనుమతులిస్తుండటంతో చెరువు, కుంటల్లో కూడా యథేచ్చగా అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీల్లో రెసిడెన్షియల్ అనుమతుల కోసం ఆప్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. జీప్లస్ 2 అనుమతులు తీసుకుని ఆరు నుంచి ఏడు వరకు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. అలాగే, 300గజాల లోపు ఇంటి నిర్మాణం కోసం మున్సిపాలిటీలు మాత్రమే అనుమతులిస్తున్నారు. ఆపైన ఉన్న గజాలకు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ, భవన నిర్మాణాల యాజమానులు 300గజాలకే టౌన్‌ప్లానింగ్ అధికారుల చేత అనుమతులు తీసుకుని ఇంకా ఎక్కువ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటంతో పాటు టౌన్‌ప్లానింగ్ అధికారుల జేబులు నిండుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని నోముల గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతులు తీసుకుని, జీప్లస్ 2 అనుమతితో ఐదు నుంచి ఆరు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.