చేవెళ్లటౌన్, ఆగస్టు 21 : ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాఫీకి నోచుకోని అన్నదాతలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయం వెనుక నిర్వహించే నిరసన, ధర్నా స్థలాన్ని ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. గత పదేండ్ల కాలంలో లేని కష్టాలు, ఇబ్బందులను ఈ ఎనిమిది నెలల కాలం లో అన్నదాతలు పడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడు విడతల్లో చేసిన రుణ మా ఫీతో లక్షలాది మందికి మాఫీ వర్తించలేదని.. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఎటువంటి షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని గురువారం ఉదయం చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించే రైతు నిరసన, ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.
ధర్నా స్థలాన్ని పరిశీలించిన వారిలో రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సంస్థ మాజీ చైర్మన్ నారాయణ, ఎంపీపీ బాల్‌రాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, అనంతరెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు రామగౌడ్, మాజీ సర్పంచ్ నరహరిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, డైరెక్టర్లు వెంకటేశ్, చందు, నాయకులు శేఖర్‌రెడ్డి, సత్తి, మహేశ్, జంగయ్య, రాంప్రసాద్, మాణిక్యరెడ్డి, బాలు తదితరులు ఉన్నారు.