వికారాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు దరఖాస్తుల వారీ గా పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భం గా దరఖాస్తుదారులు పొసెషన్‌లో ఉన్నారా..? లేదా..? పరిశీలించనున్నారు.
దరఖాస్తుదారులు పొసెషన్‌లో ఉండి రికార్డులూ సరిగ్గా ఉంటే దరఖాస్తుదారుల పేరిట 13(బీ) జారీ చేసి సంబంధిత సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్ధీకరించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డు, పొసెషన్ సరిగ్గా ఉంటే వెం టనే దరఖాస్తుదారుల పేరిట యాజమాన్య హక్కులకు సంబంధించిన ఆర్డర్‌ను జారీ చేయనున్నారు.
2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దాదాపు నెల రోజులపాటు గత బీఆర్ఎస్ హయాంలో సాదాబైనామా(తెల్ల కాగితాలపై జరిగిన భూ లావాదేవీల క్రమబద్ధీకరణ దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టుకెళ్లడంతో పెండింగ్‌లో పడిపోయింది. ఇటీవల సాదాబైనామాకు సంబంధించి కోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, జిల్లాలో 4,443 సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్ధీకరించనున్నారు.
మండలం : దరఖాస్తులు
బంట్వారం : 81
బషీరాబాద్ : 181
బొంరాస్‌పేట : 315
ధారూరు : 203
దోమ : 417
దౌల్తాబాద్ : 315
కొడంగల్ : 151
కోట్‌పల్లి : 139
కులకచర్ల : 505
మర్పల్లి : 211
మోమిన్‌పేట : 298
నవాబుపేట : 136
పరిగి : 223
పెద్దేముల్ : 315
పూడూరు : 136
తాండూరు : 246
వికారాబాద్ : 405
యాలాల : 166
మొత్తం : 4,443
బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో..
సాదాబైనామాలు అంటే తెల్ల కాగితాలపై జరిగే భూక్రయవిక్రయాలు. అధికారికంగా ఎలాంటి పట్టా లేకుండా నమ్మకంతోనే అవి జరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో గతంలో సాదాబైనామాల్లోనే క్రయవిక్రయాలు జరుగుతుండేవి. సాదాబైనామా భూములను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నది.
అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చింది. కొంతమందికి అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యతతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో వాటి క్రమబద్ధీకరణకు మరో చాన్స్ ఇవ్వాలని అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
తదనంతరం సాదాబైనామా క్రమబద్ధీకరణపై కోర్టులో కేసు ఉండడంతో పెండింగ్‌లో పడింది. సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణ పూర్తైతే ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న సంబంధిత భూములపై ఎలాంటి హక్కులు లేని రైతులకు అధికారిక హక్కులు రానున్నాయి.
కేవలం నమ్మకంతో(సాదాబైనామా)తెల్లకాగితాలపై జరిగే భూక్రయవిక్రయాలను క్రమబద్ధీకరించడంతో రైతులకు యాజమాన్య హక్కులతోపాటు ఆ భూములను అధికారికంగా క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. వీటి క్రమబద్ధీకరణతో పట్టాల్లేని భూములు జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది అధికారులకు పూర్తి అవగాహన రానున్నది. అంతేకాకుండా రైతులు బ్యాంకుల ద్వారా రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే రైతుభరోసా, రైతుబీమా పథకాల ప్రయోజనాలు కూడా రైతులకు వర్తిస్తాయి.