యాచారం, మే25: ఆరుద్ర కార్తె అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది అందరూ రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు. అలాంటి ఆరుద్ర కార్తెలో కనిపించే ఆరుద్ర పురుగులు ఈ సారి ముందే దర్శనమిచ్చాయి. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నల్లని నేలపై ఎర్రని రంగులో నిగనిగలాడుతూ ఆరుద్ర పరుగులు కనువిందు చేస్తున్నాయి. ఆరుద్ర పురుగులు కనిపిస్తే రైతులకు శుభ సూచికమని, వర్షాలు పుష్కలంగా కురుస్తాయని రైతుల నమ్మకం.
ఆరుద్ర పురుగుల దర్శనంతోనే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించనున్నట్లు పూర్వికులు చెబుతుంటారు. అలాంటి ఆరుద్ర పురుగులు మండలంలోని మేడిపల్లి గ్రామంలో రైతులకు దర్శనమివ్వటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరుద్ర పురుగులు ఎవరికి ఎలాంటి హాని చేయవని, ఆరుద్ర పురుగులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కనిపించి రైతులను ఆశీర్వదించనున్నట్లు ప్రజల నమ్మకం.