జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పటిలాగే పట్టణాల్లోని ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పలుచోట్ల గంటల తరబడి క్యూలో నిల్చ్చొని ఓటేశారు.
హైదరాబాద్లో నివాసముంటున్నవారు సొంత గ్రామాల బాట పట్టడంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. రాత్రి వరకు జిల్లాలో మొత్తం 59.96 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 83.23 శాతం నమోదుకాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 48.85 శాతం నమోదైంది.
-రంగారెడ్డి, నవంబర్ 30(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులుదీరారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా ఓటర్లు క్యూలో బారులుదీరారు. దివ్యాంగులు, మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్లలో సిబ్బంది తీసుకెళ్లి ఓటు వేయించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నీటి వసతి, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. రంగారెడ్డి జిల్లాలోని 3,453 కేంద్రాల్లో.. వికారాబాద్ జిల్లాలోని 1133 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం.. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఒకట్రెండు చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసింది.