రంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురవుతున్నామని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బకాయిలొస్తే పిల్లల వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఈఎంఐలు, గృహ నిర్మాణాలతోపాటు చేసిన అప్పులు తీర్చుకోవచ్చునని భావించామని ..తాము పదవీవిరమణ పొంది 20 నెలలు దాటినా రూపాయీ రాలేదని వాపోతున్నారు.
తాము ప్రభుత్వానికి జీవితకాలమంతా సేవ చేశామని ..బెనిఫిట్స్ చెల్లించడంలో సర్కార్ తాత్సారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పదవీవిరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు 500లకు పైగా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికీ సుమారు రూ. 30,000,00-రూ. 50,000,00 వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వం డబ్బుల్లేవన్న సాకుతో బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పర్సంటేజీ ఇస్తేనే ఫైళ్లు ముందుకు..
జిల్లాలో ఉద్యోగవిరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు పర్సంటేజీ ఇస్తేనే ముందుకు కదులుతున్నాయని పలువురు విశ్రాంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తమకు రూపాయీ రాలేదని అలాంటప్పుడు పర్సంటేజీ ఎలా ఇస్తామని.. తాము బతకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతి
2024 మార్చి తర్వాత ఉద్యోగవిరమణ పొందిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇప్పించాలని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఆ డబ్బులొస్తే పిల్లల వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఈఎంఐలు, గృహ నిర్మాణాలతోపాటు చేసిన అప్పులు తీర్చుకోవచ్చునని భావించామని .. తాము పదవీవిరమణ పొంది 20 నెలలు దాటినా రూపాయీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్స్ రాకపోవడంతో ప్రశాంతతను కోల్పో యి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమం లో రిటైర్డ్ ఉద్యోగుల ఫోరం కన్వీనర్ అనంతరెడ్డి, కో-కన్వీనర్ జనార్దన్‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, రాధాకృష్ణరెడ్డి, దేవిడ్ పాల్గొన్నారు.
నవంబర్ 17న మహాధర్నా..
ఉద్యోగవిరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో రాకపోవ డాన్ని నిరసిస్తూ వచ్చే 17న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మంచిరెడ్డి అనంతరెడ్డి తెలిపారు. ఈ నిరసనకు విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవి..
కమ్యూటేషన్, గ్రాట్యూటీ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం,ఫైనల్లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
తమ బెనిఫిట్స్‌ను వెంటనే ఇప్పించాలని సోమవారం రంగారెడ్డి కలెక్టర్రేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు