నీళ్లు లేక వరి పంట ఎండిపోతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతుండడంతో వ్యవసాయ బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోతున్నది. ఫలితంగా చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థ అంతా.. ఇంతా కాదు. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకున్నా.. వ్యాపారులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి సాగు చేసి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు ఎండిపోతుండడంతో అన్నదాత బోరున్న విలపిస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో వరి చేనుల్లో పశువులను మేపుతున్నాడు. పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదని.. తీసుకొచ్చిన అప్పులు తీర్చే మార్గ మూ కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. .. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ
నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. అందులోని రెండు ఎకరాల్లోని పంట పూర్తిగా ఎండిపోయింది. బోరు నుంచి నీరు సన్నగా వస్తుండడంతో మిగిలిన పంట పండుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. ఆ బాధతో నా భర్త అనారోగ్యం పాలయ్యాడు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పంటల సాగుకు ముందే రైతుబంధు పెట్టుబడి సాయా న్ని సమయానికి ముందే అందించేవారు. దాంతో విత్తనాలు, ఎరు వులను తెచ్చుకునేది. కానీ, కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిసాయం కూ డా సక్రమంగా అందడం లేదు. అప్పులు తీసుకొచ్చి పంటను సాగు చేసినా భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
-బోనస్ అమృత, రైతు, గిరిజాపూర్, తాండూరు
ఎప్పటిలాగే నాలుగున్నర ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. భూగర్భజలాలు అడుగంటుతుండడంతో బోరుబావుల్లో నీరు ఇంకిపోయి వరి పంట ఎండుముఖం పడుతున్నది. చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోవడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. రేవంత్ సర్కార్ రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకున్నా.. అప్పులు తీసుకొచ్చి పంట ను సాగు చేశా. మాజీ సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నది. పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎం డిన పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి.
-వెంకటేశ్, రైతు, గిరిజాపూర్
నేను ఐదు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. భూగర్భజలాలు తగ్గి బోర్ల నుంచి నీరు సరిపడా రాకపోవడంతో ఇప్పటికే మూడు ఎకరాల్లోని పంట పూర్తిగా దెబ్బతి న్నది. రెండు ఎకరాల్లో ఉన్న పంటను కాపాడుకునేందుకు చాలా ఇబ్బంది పడుతు న్నా. అప్పులు తీసుకొచ్చి పంటను సాగు చేశా. పెట్టుబడి కూడా వస్తుందన్న నమ్మకం లేదు. తీసుకొచ్చిన అప్పులు తీర్చే మార్గమూ కనిపించడంలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– రాజూనాయక్, ముష్టిపల్లితండా, కొందుర్గు
నేను రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బు తీసుకొచ్చి పంటను సాగు చేశా. ఎండలు ముదురుతుండడంతో చేతికొచ్చిన పంట ఎండిపోతున్నది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నది. తీసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలి.
– కృష్ణయ్య, రైతు, గుర్రంపల్లి, కొందుర్గు
దౌల్తాబాద్ : భూగర్భజలాలు అడుగం టిపోతుండడంతో మండలంలోని బో రు బావుల వద్ద సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. సుల్తాన్పూర్ గ్రామంలోని రైతు కావలి మొగులప్ప అనే రైతు సాగు చేసిన రెండెకరాల వరి పంటకు సాగునీరు అందక పూర్తిగా ఎండిపోవడంతో అందులో పశువులను మేపుతున్నారు. గతంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండి రెండు పంటలను సాగు చేసుకునే వారిమని.. ప్రస్తుతం అవి అడుగంటిపోతుండడంతో గుండె కోత తప్పడం లేదని పలువురు అన్నదాతలు పేర్కొంటున్నారు. కాగా ఎండిన పంటను దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాని డిమాండ్ చేశారు.
బోరు ఉన్నదనే నమ్మకంతో నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. అయితే, రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటి బోరు నుంచి వచ్చే నీరు ఆగిపోవడంతో రెండు ఎకరాల్లోని పంట ఎండిపోయి భూమిలో నెర్రెలు వచ్చాయి. మిగిలిన రెండెకరాల పొలానికి పక్క బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. ఉన్న బోరును ఫ్లషింగ్ చేయిద్దామంటే చేతిలో రూపాయీ లేదు. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడంతో తెలిసిన వారి వద్ద రూ.70,000 అప్పుగా తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశా. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించడంలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలి.
-వెంకట్‌రెడ్డి, రైతు, చింతామణి పట్టణం, తాండూరు రూరల్
కేశంపేట: రోజురోజుకూ ముదురుతున్న ఎండలతో పంటలు దెబ్బతింటుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటలు చేతికొచ్చే సమయానికి భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు ఇంకిపోతుండడంతో సగానికిపైగా బోర్లు నీరు పోయడంలేదు. బోరు మోటర్లను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతన్న ఎండుతున్న పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మండలంలో కొద్దిమేర పంటలు పాడవకుండా ఉన్నాయంటే అం దుకు సమీప పొలాల్లోని రైతులు అందిస్తున్న నీటి సాయమే కారణం. ఆ నీళ్లు కూడా ఇంక ఎన్ని రోజు ల వరకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. గత వానకాలంలో 4000 ఎకరాల్లో సాగైన వరి పంట నేడు 2,200 ఎకరాలకు పరిమితమైనట్లు వ్యవసాయశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతన్న ఆవేదన అంతా..ఇంతా కాదు.