రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఉద్యమన్ని ఆపేది లేదని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. ఆసరా పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఏడాది గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
డిసెంబర్ నుంచి పింఛన్లు పెంచుతామని సోషల్ మీడియాలో ప్రకటన చక్కర్లు కొడుతున్నదని, ఎవరూ నమ్మవద్దన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశాడో.. అప్పటి నుంచి పెంచిన పింఛన్లను ఇస్తే తప్పా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదన్నారు.
నవంబర్ 26న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాకు ఆసరా పింఛన్‌దారులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరంటోత్ శ్రీనివాస్‌నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిలివేరు యాదమ్మ, జిల్లా నాయకులు జంగమయ్య, బాలరాజు, సలీం, సంజీవ, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.