రంగారెడ్డి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇరిగేషన్ శాఖ అధికారుల అలసత్వం కబ్జారాయుళ్లకు వరంగా మారింది. జిల్లాలో వందల ఏండ్ల నాటి చరిత్ర కలిగిన చెరువులు యథేచ్ఛగా కనుమరుగవుతున్నాయి. కొందరు రాత్రికి రాత్రే తూములను ధ్వంసం చేసి కట్టలను తొలగిస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు మాత్రం మొద్దు నిద్రను వీడడంలేదన్న ఆరోపణలున్నాయి. చెరువులు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తే.. కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా వారికి నోటీసులిచ్చి కుమ్మక్కవుతు న్నారని మండిపడుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, రాందాస్పల్లిలోని మర్రిగూడెం కుంటకట్టను కొందరు యథేచ్ఛగా తొలగించి చెరువు నామరూపాలు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని వాపోతున్నారు. అలాగే, మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లోనూ చెరువుల తూములను ధ్వంసం చేసి కట్టలను తొలగిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు కొంతమంది రియల్టర్లు ఏకంగా చెరువుల్లో ని శిఖం పట్టాలను కొని.. చెరువుల్లో నీరు నిల్వకుండా తూములు, కట్టలను ధ్వంసం చేసి చెరువుల ఆనవాళ్లనే మా యం చేస్తున్నారు.
హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, కడ్తాల్, మాడ్గుల వంటి మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంట లు ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువులు, కుంటలు ధ్వంసం చేసేవారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. దీనిని బట్టి కబ్జారాయుళ్లు, అధికారులు కుమ్మక్కయారని ప్రజలు మం డిపడుతున్నారు.

Rr1
జిల్లాలో 1,500 చెరువులు, కుంటలు
జిల్లాలో ఇరిగేషన్ అధికారుల రికార్డుల ప్రకారం 1,500 వరకు చెరువులు, కుంటలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో అనేక చెరువులు, కుంటలు నామరూపాలు లేకుండా పోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా వచ్చినా ఆగని ఆక్రమణలు..
హైదరాబాద్ శివారులోని చెరువులు, కుంటల పరిరక్షణతోపాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా వచ్చినా ఆక్రమణలూ ఆగటంలేదు. జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, కాల్వల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎల్వోసీలు తీసుకుని ప్లాట్లు గా మార్చారు. దీంతో చెరువులు, కుంటల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
కంచె చేను మేసినట్టు..
జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారుల తీరు కంచె చేను మేసినట్టుగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. జలవనరులను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఎవరైనా చెరువులు, కుంటల సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందుగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఆ ప్రాంతంలో జాయింట్ సర్వే నిర్వహించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు ముడుపులు ముట్టచెప్పి యథేచ్ఛగా ఎన్వోసీలు తీసుకుని అక్కడ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.