తాండూరు, జనవరి 9: ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా చలి పంజా విసురుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగువస్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తాళ్లపల్లిలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 6.4, తాండూరులో 7, దుద్యాల్‌లో 7.1, బంట్వారంలో 7.6, వికారాబాద్‌లో 7.7, దౌల్తాబాద్‌లో 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.