వికారాబాద్, నవంబర్ 15 : గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, వారికి ప్రభుత్వ పథకాలను అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ధరతి ఆబ భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన దినోత్సవ సమరోహం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ దేశంలోని 100 జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్యమాలిక ద్వారా అధికారులు, గిరిజనులు తిలకించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. గిరిజనులకు మెరుగైన వసతులు కల్పించడమే ధరతి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ స్కీం కింద జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన 31 ఆవాసాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గిరిజన వస్త్రధారణలో చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్న ది. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, ప్రత్యేక అధికారిణి ఫణికుమారి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ శాఖ అధికారులు, వివిధ గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.