వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయా న్ని ప్రశ్నిస్తే.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బూతులు, వ్యక్తిగత దూషణకు దిగారని ఆమె ఆగ్ర హం వ్యక్తం చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు 90టీఎంసీలు కేటాయిస్తే.. 45 టీఎంసీలే సరిపోతుందని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని, డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాది అవుతున్నా ఎందుకు పంపించలేదని కేసీఆర్ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా సీఎం పదవికి కళంకం వచ్చే లా రేవంత్‌రెడ్డి మాట్లాడారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రజల కోసం అడిగితే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారని, మైక్ పడితే చాలు కేసీఆర్ సావు కోరుకుంటున్నారన్నారు. సాగు నీరొస్తుందని ఈ ప్రాంత ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారని.. ఇప్పటికైనా మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు నీరందించాలన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప.. ఈ ప్రాంత రైతులకు సాగునీరొస్తుందని కాంగ్రెస్ ప్రభు త్వం భావించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టగా కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులతో సగం కాలం వాటి చుట్టూ తిరిగేందుకు సరిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముందుగా చెరువులను బాగు చేసుకున్నామని తర్వాత గోదావరి బేసిన్ నీటిని వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును, కృష్ణా బేసిన్‌లోని నీటిని వినియోగించుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారని, అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగారన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తైతే కల నెరవేరుతుందని కేసీఆర్ పేర్కొన్నా విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తికి మిగిలిన పదిశాతం కాల్వల నిర్మాణం పనులు పూర్తైతే పరిగి నియోజకవర్గానికి ఇప్పటికే సాగునీళ్లొచ్చేదన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడంతోపాటు పాలమూరు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నారు. పాలమూ రు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తామన్నారు. అంతేకాకుండా ఈ మధ్య చెక్‌డ్యాంలను పేల్చి వేసిన ఘటనలు జరుగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బాంబులు పెట్టి కూల్చివేశారమోననే అనుమానం కలుగుతుందని.. కాళేశ్వరం ప్రాజెక్టును రెండేండ్లుగా రిపేర్ చేయకుండా పూర్తిగా కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని మండిపడ్డారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, ఆంజనేయులు, అనంత్‌రెడ్డి, గోపాల్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తి కాగా.. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో రూపాయీ కేటాయించకుండా తట్ట మట్టి కూడా తీయకుండా పడావ్గా పెట్టారు. పాలమూరు ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలు ప్రజలందరికీ తెలిసేలా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పెద్ద ఎత్తు న సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మండల కేంద్రాలు, గ్రామా ల్లో కరపత్రాల పంపిణీతోపాటు అవసరమైతే దీక్షలు నిర్వహించి ప్రాజెక్టుకు ఏ విధంగా ధోకా చేస్తున్నారో వివరిస్తాం. రేవంత్ సర్కార్ తీరుతో వికారాబాద్ జిల్లాలోని 5-6 లక్షల ఎకరాలకు రావాల్సిన నీరు రాకుండా పోతున్నది. మరోవైపు కొడంగల్‌కు మాత్రమే నిధులు కేటాయించడం, సాగునీళ్లు ఇవ్వడం, వికారాబాద్‌కు మం జూరైన వ్యవసాయ యూనివర్సిటీని కొడంగల్‌కు తీసుకుపోయి రేవంత్‌రెడ్డి.. కేవలం కొడంగల్‌కు మాత్రమే సీఎంలా గా పని చేస్తున్నాడు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను పడావ్ పడేసినందుకే.. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును 90% వరకు నిర్మించా రు. సమైక్య రాష్ట్రంలో పెండింగ్‌లో పడిన ప్రాజెక్టులను కేసీఆర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. వికారాబాద్ పట్టణంలో బ్రిడ్జిల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు. వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కిడ్నీ రోగుల నిమిత్తం గత కేసీఆర్ ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ పోతే జనరేటర్‌ను కూడా సమకూర్చలేని దుస్థితి నెలకొన్నది.
కిడ్నీ రోగులకు వారం, పది రోజులకిచ్చే ఇంజెక్షన్లను నెలరోజులైనా ఇవ్వడంలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగితే సరి గ్గా ఇండెంట్ ఇస్తలేరని చెబుతున్నారు. రూ.లక్షన్నర కోట్లు పెట్టి మూసీని సుందరీకరిస్తామని రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతుండు.. కానీ, వికారాబాద్‌లో ఉన్న ఎస్టీపీ పనిచేయకపోవడంతో వికారాబాద్ మున్సిపాలిటీ మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తున్న ది. మూసీ పుట్టే వికారాబాద్ ప్రాంతాన్నే పట్టించుకోని రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణను ఏం చేస్తారు. – డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. 45 టీఎంసీలు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడంతోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై సీఎం రేవంత్‌కు ఉన్న ప్రేమ తెలుస్తున్నది. గత కేసీఆర్ హయాంలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును 12.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా 90 శాతం పనులను పూర్తి చేయడంతోపాటు 5 రిజర్వాయర్లను పూర్తి చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు దాదాపు రూ.35 వేల కోట్లను మంజూరు చేయగా, రూ. 27,500 కోట్లను ఖర్చు 90 శాతం పనులను గత కేసీఆర్ పూర్తి చేయగా.. మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయడంలో రేవంత్ సర్కార్ కావాలనే తాత్సారం చేస్తూ.. అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నది. పాలమూరు ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే ఉద్యమించాల్సిందే.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం జనార్దన్‌రెడ్డి లాం టి కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులపై పోరాడేందుకే ఐదేండ్లు పట్టింది. పాలమూరు బిడ్డనని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి పాలమూరు రైతులకు సాగునీరొచ్చే ప్రాజెక్టుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గత కేసీఆర్ ప్ర భుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేసిం ది. ఆ పనులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అన్న విష యం కూడా మర్చి పోయి వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే కొడంగల్ సెగ్మెంట్లోని 1.20 లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది.
అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, బూతులే.. ఇక ముందు కేసీఆర్, కేటీఆర్‌ను బూతులు తిడితే సహించం, తీవ్ర పరిణామాలుంటాయి. కేసీఆర్ కాలి గూటికి కూడా రేవంత్ సరిపోడు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో, పంచాయతీ ఎన్నికల సమయంలో రెండుసార్లు భూమి పూజ చేసిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డే అని ఎద్దేవా చేశారు. జురాల నుంచి సాగునీరు తీసుకొస్తామని రూ.4వేల కోట్ల టెండర్లు పిలిచి కమీషన్లు తీసుకుని పక్కన పడేసిండ్రు. కొడంగల్‌కు మెడికల్ కాలేజీ, వ్యవసాయ యూనివర్సిటీలు మంజూరు చేశామని గొప్పలే.. అవి ఇప్పటికీ ప్రారంభమే కాలేదు.
– పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసే వరకూ పోరాడుతాం. ఈ ప్రాజెక్టును చేపట్టకుండా కాంగ్రెస్ నాయకులు 200 వరకు కేసులేశారు. పదిశాతం మిగిలిన కాల్వల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే టెండర్లు పూర్తి చేస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కావాలనే వాటిని రద్దు చేసింది. చౌడాపూర్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉండడంతో రూ.5600 కోట్ల టెండర్లను పునరుద్ధరిస్తే సాగు నీరు వస్తుంది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రాజెక్టునూ నిర్మించలేరు, కొత్త పథకాన్నీ తీసుకురాలేదు. పాలమూరు ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై గ్రామగ్రామానా పోరాటం చేసి ప్రజలకు తెలియజేస్తాం.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే