మియాపూర్ : దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, సమయానికి విరుద్ధంగా భోజనం సహా పలు ఇతర కారణాలతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇలాంటి వాటిని అథికమించేందుకు ప్రణాళికా బద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని అప్పుడే హృదయం పదిలంగా ఉంటుందన్నారు.
వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట రోడ్డులో శ్రీశ్రీ హోలిస్టిక్ దవాఖానలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, దవాఖాన ఛైర్మన్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ తుషార, సీఈవో సుబ్బారావు , ప్రముఖ హాస్య నటుడు ప్రవీణ్, ట్రాఫిక్ సీఐ బోసులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ గుండె సంబంధ వ్యాధుల బారిన పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ వ్యాయామాన్ని రోజువారీలో తప్పకుండా భాగంగా మలుచుకోవాలన్నారు. యోగా , ప్రాణాయామాలు గుండె పదిలానికి ఎంతో దోహదపడతాయన్నారు. ప్రజలలో అవగాహనకు దవాఖాన యాజమాన్యం చేస్తున్న కృషిని విప్ గాంధీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నర్సింలు, బాచుపల్లి ఏఎస్ఐ కృష్ణ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో బాధితులను కాపాడేందుకు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై నిర్వహించిన శిక్షణను పూర్తి చేసుకున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పాత్రికేయులకు విప్ గాంధీ ధృవీకరణ పత్రాలను అందించారు.