సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ముసుగులో కాంగ్రెస్ సర్కారు సామాన్య ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. ఖజానాను నింపుకోవడమే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ (వినోదపు పన్ను) భారం మోపేందుకు కసరత్తును ప్రారంభించింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, ఇతర వినోదపు కార్యక్రమాలపై కూడా పన్ను వసూలు చేసేందుకుగానూ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సీఎస్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి డేటా సేకరణ పేరిట థియేటర్ల ఆదాయంపై నిఘా పెట్టడం గమనార్హం. ఈ మేరకు జీవో నంబర్ 81ను జారీ చేసిన ప్రభుత్వం, సీఎస్ అధ్యక్షతన జరిగే ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీలో ఆర్థిక, మున్సిపల్, రవాణా, ఐటీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. స్థానిక సంస్థల ద్వారా వినోదపు పన్ను వసూలు చేసే సాధ్యసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి, 60 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత జీవోలో పేర్కొన్నారు.
తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో రద్దు చేసిన వినోదపు పన్నును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే డేటా సేకరణ, వినోదపు పన్ను విధించడానికి సాధ్యాధ్యాలను పరిశీలించడానికి సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటిని ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టికెట్ల ఆధారంగా థియేటర్ల నుంచి వినోదపు పన్ను వసూలు చేయగా…మళ్లీ ఆ దిశగా కసరత్తు జరుగుతున్నది. వాస్తవంగా రాష్ట్రంలో సుమారు సినిమా థియేటర్ల సంఖ్య సుమారు 450 నుండి 570 వరకు (సింగిల్ స్రీన్లు మరియు మల్టీప్లెక్స్ లు కలిపి) ఉన్నట్లు అంచనా. అయితే, థియేటర్ల నిర్వహణ ఖర్చులు, తకువ ప్రేక్షకుల ఆదరణ కారణంగా సింగిల్ స్రీన్ థియేటర్లు తగ్గుముఖం పడుతున్నాయి.
ఏప్రిల్ 2026 నాటికి, హైదరాబాద్‌లోనే 241 థియేటర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. థియేటర్లను కాపాడుకునేందుకు, ఏప్రిల్ 2026 నుండి ఫిక్స్ డ్ రెంట్ బదులు పర్సంటేజ్ (రెవెన్యూ షేరింగ్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి సినిమాల వసూళ్లలో థియేటర్ వాటా ఇలా ఉంటుంది.. మొదటి వారం.. వసూళ్లలో 60 శాతం, రెండో వారం వసూళ్లలో 50 శాతం, మూడో వారం వసూళ్లలో 40 శాతం. సినిమా ప్రదర్శన కొనసాగాలంటే ఒక షోకి కనీసం ‘హౌస్ ఫుల్ గ్రాస్ ’ వసూలు కావాలనే నిబంధన కూడా పెట్టారు. సింగిల్ స్రీన్లు తగ్గుతున్నా, మల్టీప్లెక్స్ స్రీన్ల సంఖ్య పెరుగుతున్నది. కరోనా తర్వాత థియేటర్లకు ఆదరణ, చిన్న సినిమాల వసూళ్లు తగ్గడం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ వినోదపు పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో థియేటర్ల యజమానులు స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే.
మళ్లీ తెరపైకి..
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వినోదపు పన్ను వసూలు చేయడానికి కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. థియేటర్లతోపాటు అమ్యూజింగ్ పారులు, ప్రభుత్వం గుర్తించిన ఇతర కార్యక్రమాలకు సైతం వినోదపు పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న అవకాశాలను పరిశీలించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను సైతం అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని థియేటర్లలోని టికెట్ల అమ్మకాలకు సంబంధించిన డేటా సేకరణకు స్టీరింగ్ కమిటీ చర్యలు తీసుకోనుందని అధికారులు చెబుతున్నారు. కాగా థియేటర్లను కాపాడుకోవాల్సింది పోయి వాటిని ఆదాయ వనరుగా చూడడం సినిమా పరిశ్రమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.