రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షలా మారింది. మెరిట్ కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రభుత్వం వారికి ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించింది. వారు ఉత్తీర్ణు లై పై చదువులకు వెళ్లే క్రమంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు రాక.. ఆయా కళాశాల యాజమాన్యా లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఓవైపు బీటెక్, మరోవైపు డిగ్రీలో చేరేందుకు సమయం దగ్గర పడడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రాయితీలు రాకపోవడంతో సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ యాజమాన్యాలు మొండికేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం తో సర్టిఫికెట్లు ఇచ్చేస్తే ఫీజులు వసూళ్లు చేసుకోలేమన్న ఉద్దేశంతో ప్రైవేట్ కళాశాలలు వాటిని ఇవ్వటంలేదు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఆయా కళాశాలల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తుర్కయాంజాల్ న్యూ శ్రీచైతన్య కళాశాలకు చెం దిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం రోడ్డెక్కారు. పోలీసులు వారిపై చేయిచేసుకోవటంతోపాటు విద్యార్థిసంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారు.
84 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల నిరాకరణ..
జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఫీజు రాయితీ ఇస్తామని తుర్కయాంజాల్‌లోని న్యూశ్రీచైతన్య కళాశాలలో చేర్పించింది. ఇంటర్ రెండేండ్లు పూర్తైన విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ఆ కాలేజీ చుట్టూ గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ రాలేదని, ఈ రాయితీ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం తెగేసి చెబుతున్నది. దీంతో సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులకు పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలుపటంతో వారంతా సాగర్ రోడ్డుపై తుర్కయాంజాల్‌లో రాస్తారోకోకు దిగారు.
న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను కలిసి..
ఇంటర్ పూర్తైనా తమకు న్యూశ్రీచైతన్య కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని తమకు న్యాయం చేయాలం టూ విద్యార్థులు మం గళవారం రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన ఆ కళాశాలకెళ్లి యాజ మాన్యంతో చర్చించి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించాలని జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆదిబట్ల ఠాణాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపినా యాజమాన్యం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది.
అగమ్యగోచరంగా విద్యార్థుల భవిత..
రాష్ట్రంలో మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి విద్యనందిస్తున్నది. వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవటంతో విద్యార్థులకు ఆ సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వటంలేదు. ఇబ్రహీంపట్నంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ప్రభుత్వం నుంచి ఫీజులు రాక పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కూలీ పనులు చేసుకునే మేము ఫీజు ఎలా చెల్లించాలి
తాము కూలీ పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లలు మంచిగా చదవడంతోనే ప్రభుత్వం వారిని ప్రైవేట్ కళాశాలల్లో చేర్పించింది. తీరా సర్టిఫికెట్లు అడిగే సమయంలో ఫీజులు కట్టాలంటే కూలీ పనులు చేసుకునే తాము ఎక్కడినుంచి కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా కళాశాలల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. -విద్యార్థుల తల్లిదండ్రులు