వికారాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి త్వరలో శిక్షణనిచ్చేందుకు ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం పూర్తి చేశారు. ఎన్నికల వేళ డబ్బు, మద్యం ప్రవాహాన్ని ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లా అంతటా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై కూడా ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ప్రతి రోజూ ఏ పార్టీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఏయే ఖర్చులు పెడుతున్నారనే దానిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేయగా, మరో పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఏ అభ్యర్థి కూడా ఎన్నికల సంఘం నిర్ణయించిన దానికి మించి ఖర్చు చేయకుండా.. అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎంతమేర ఖర్చు చేసారనేది ఆన్లైన్లో తెలిసేవిధంగా ప్రత్యేక వెబ్సైట్లో పొందుపర్చనున్నారు.
ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం తరలించకుండా జిల్లా ఎన్నికల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లా అంతటా 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కర్నాటక నుంచి మద్యం, డబ్బు తరలించే అవకాశాలున్న దృష్ట్యా అంతర్రాష్ట్ర సరిహద్దులోని బషీరాబాద్, కొడంగల్, దౌల్తాబాద్, బంట్వారం మండలాల్లో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు నిఘా పెట్టారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షలపైనే నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారంపై కూడా జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలతోపాటు ర్యాలీలు, రోడ్‌షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి ఎల్ఈడీ స్క్రీన్లు, భోజనం, టీ, కాఫీ వరకు అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభ్యర్థుల ఖర్చులో ఖాతాలో కలుపుతున్నారు. అభ్యర్థులు చేసే ఖర్చును చూసేందుకు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన ఒక్కో ఆడిట్ బృందాన్ని జిల్లా ఎన్నికల అధికారి నియమించారు. ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు చేసే ప్రచారంపై పూర్తి నిఘా పెట్టి దేనికెంత ఖర్చు పెడుతున్నారో పరిశీలిస్తూ ఎన్నికల అధికారులకు సమాచారాన్ని అందజేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు ఖర్చు చేయాలనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచారం ముగిసే వరకు ఆయా పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చుకు సంబంధించి ప్రతి పైసా ఎన్నికల అధికారులకు లెక్క చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం ముగిసే నాటికి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని ఈసీ నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో రూ.28 లక్షలుగా నిర్ణయించిన ఎన్నికల సంఘం, ఈ ఎన్నికల్లో రూ.12 లక్షలను పెంచుతూ రూ.40 లక్షలుగా నిర్ణయించింది. తినుబండారాల నుంచి ప్రచార సామగ్రి వరకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించి వాటి ధరలను నిర్ణయించింది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తినుబండారాల ధరలతోపాటు ప్రచార సామగ్రి వస్తువుల ధరలను పెంచింది.