ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 7 : ఇబ్రహీంపట్నం డివిజన్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీల్లో ఆందోళన మొదలైంది. అదేంటంటే.. ప్రతి పార్టీ నుంచి ఆయా గ్రామాల్లో నాలుగు నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకోసం ఎదురుచూస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుకానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఇతర పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండటం మంచిది కాదని భావించి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వుడ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు.
కులం ఓట్లే ప్రామాణికం..
ప్రతి సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతడి సామాజిక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు..? తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గురించి తగిన హామీలిచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీచేసి తీరుతామని భీష్మించుకూర్చున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు.
తాయిలాల ఎర..
దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవులపరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
రంగంలోకి దిగుతున్న సీనియర్లు..
ముఖ్యంగా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో గ్రామపంచాయతీలు, వార్డులకు నామినేషన్లు ముగిసింది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ఒకేపార్టీ నుంచి నామినేషన్లు వేసిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించేందుకు ఆయా పార్టీల సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసినందున ఉపసంహరించేందు కోసం తాయిలాల ఆశ చూపుతున్నారు.
