ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. స్థలం ఉన్న పేదలు ఇండ్లను నిర్మించుకునేందుకు రూ. ఐదు లక్షల చొప్పున పంపిణీ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటిం చిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో ఆ పార్టీ వర్గీయులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ కమిటీల్లో పేదలకు చోటు దక్కినప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని.. కానీ, కాంగ్రెస్ నాయకులకు పెత్తనం కట్టబెట్టేలా కమిటీలు వేస్తే.. పేదలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కమిటీల్లో ఉండే వారికి వంగి వంగి దండాలు పెట్టే వారికే ఇండ్లు మంజూరై.. పేదలకు ఇండ్లు రాక అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు అంటూ గొప్పగా ప్రకటించిన ఆ పార్టీ నాయకులు..అధికారంలోకి రాగానే మాట మార్చారు. ఇందిరమ్మ పథకం మార్గదర్శకాల ప్రకారం.. కమిటీల ఏర్పాటులో అందరికీ అవకాశం ఇవ్వాల్సి ఉం డగా ఆ పార్టీ కేడర్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కమిటీలు, మున్సిపల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణాల్లో అయితే మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్‌గా, వార్డు అధికారులు కన్వీనర్లుగా ఉంటారు.
వారి సమక్షంలో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు, స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులే చైర్మన్లుగా ఉంటారు. కాగా ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తు న్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో తమకు అనుకూలంగా ఉండే వారినే చేర్చుకొని పెత్తనం చెలాయించే ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలను సంప్రదించకుండానే అధికారులు కూడా నాయకులను సంప్రదించి పేర్లను నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
హస్తం కేడర్‌లో కమిటీల చిచ్చు
ఇందిరమ్మ ఇండ్లు వచ్చేదెప్పుడో.. లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకునేది ఎప్పుడో తెలియదు కానీ.. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో తమతమ వర్గీయుల పేరు రాసే విషయంలో మాత్రం అసంతృప్తితోపాటు విభేదాలు ఏర్పడుతున్నాయి. కమిటీలను బహిరంగంగా ఏర్పాటు చేస్తే పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. కుమ్మక్కై కమిటీలను ఏర్పాటు చేస్తుండడంతో కాంగ్రెస్ వర్గీయుల్లో వర్గ పోరు ఆరంభమైనది.
జిల్లాలోని 9 మండలాల్లోనే పూర్తి ..
జిల్లాలో ఇప్పటివరకు కేవలం తొమ్మిది మండలాల్లో మాత్రమే కమిటీలు ఏర్పా టయ్యాయి. మిగిలిన మండలాల్లో మేమంటే మేము ..అన్నట్లుగా కాంగ్రెస్ వర్గీ యులు పట్టుదలకు పోతుండడంతో పూర్తి కావడంలేదు. కమిటీల ఏర్పాటు సమయంలోనే ఈ విధంగా ఉంటే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సమయంలో ఎలా ఉంటుందోనని స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వర్గ పోరుతో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన.. ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో అంతర్గత కుమ్ములాటలతో పూటకోసారి సభ్యుల పేర్లు మారుతున్నాయి.
అందరి సమక్షంలో ఏర్పాటు చేయాలి..
కమిటీలను అంతర్గతంగా, ఎవరికీ తెలియకుండా ఏర్పాటు చేయొద్దు. అర్హులైన పేదలకు న్యాయం జరుగాలంటే అందరి సమక్షంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో కాంగ్రెస్ వర్గీయులే అధికంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.
-రమేశ్‌బాబు, మాజీ సర్పంచ్, కొడంగల్
కమిటీల ఏర్పాటు పారదర్శకంగా జరగాలి..
ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు ఉపయోగపడేది. అందువల్ల కమిటీలను పారదర్శకంగా ఏర్పాటు చేస్తే పేదలకు న్యాయం జరుగుతుంది. అర్హులైన పేదలు, ఇండ్లులేని వారికి ఇండ్లను కేటాయిస్తేనే ఈ పథకం సంకల్పం నెరవేరుతుంది. -మధుసూదన్‌రావు యాదవ్,2వ వార్డు కౌన్సిలర్, కొడంగల్ మున్సిపాలిటీ