ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వాగులు రోడ్లపై పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్ష సూచనతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు రంగంలోకి రక్షణ చర్యలు చేపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండవద్దని సూచిస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డిజిల్లా తడిసి ముద్దయింది. పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. గతంలో ఎన్నడూ నిండని చెరువులు కూడా ఈ వర్షాలకు నిండాయి. ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. షాబాద్ మండలంలోని పహిల్వాన్ చెరువు నిండి అలుగు పారుతున్నది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటితో నిండుకుండలా మారింది. మూసీ ప్రవాహానికి శంకర్పల్లి మండలంలోని పలు పంటపొలాల్లోకి నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. మాడ్గుల మండలంలోని సుద్దపల్లివాగు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇండ్లలో నుంచి ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తలకొండపల్లి, ఆమనగల్లులో అత్యధిక వర్షపాతం నమోదు
రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా పరిధిలోని తలకొండపల్లి మండలంలో 11, ఆమనగల్లులో 8, మాడ్గులలో 5, కడ్తాల్‌లో 4, కేశంపేటలో 6 సెంటీమీటర్ల చొప్పున వ్షరపాతం నమోదైంది. గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మంచాల, యాచారం, మహేశ్వరం, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, నందిగామ, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, చౌదరిగూడ మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
పంటలకు అపార నష్టం
జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. చేతికందివచ్చిన పత్తి, మొక్కజొన్న, వరి పూర్తిగా తడిసి ముద్దయింది. పత్తి కాయలు నేలరాలుతున్నాయి. దీంతో తేమ శాతం పెరిగి కొనుగోలు చేసేవారు లేకుండాపోయారు. వరి రాలి నేలపై పడింది. దీంతో వడ్లు మొలకెత్తే అవకాశముందని రైతులు వాపోతున్నారు.

పూడూరు మండలంలో 61.5 మి.మీ. వర్షపాతం నమోదు
వికారాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : తుపాను ప్రభావంతో జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, శివసాగర్ తదితర చెరువులు అలుగు పారుతున్నాయి. యాలాల మండలం, అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య బుధవారం ప్రమాదవశాత్తు కాగ్నా వాగు వరదలో కొట్టుకుపోతున్నాడు. తాండూరు మండలం, వీర్‌శెట్టిపల్లి గ్రామ సమీపంలోని బిడ్జ్రి సమీపంలో గమనించిన గుడిసె శ్రావణ్‌కుమార్, చీమల హరీశ్‌కుమార్ తాళ్ల సహాయంతో నర్సయ్యను కాపాడారు. జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా చేతికొచ్చిన పత్తి పంట వర్షానికి నల్లబారింది.
పత్తి ఏరేందుకు సిద్ధమైన సమయంలో వర్షాలు కురుస్తుండడంతో పత్తి సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పత్తి పంట కొట్టుకుపోవడం, ఎర్రబారి నష్టపోయిన రైతులకు కనీసం చేసిన అప్పునకు వడ్డి అయినా చెల్లించేందుకు ఆసరా అవుతుందనుకున్న సమయంలో మరోసారి తుఫాను ప్రభావంతో పత్తి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చేసిన ఆలస్యానికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. భారీ వర్ష సూచనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవును ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటించడంపై, జిల్లా విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా, ముందుచూపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మండలం : వర్షపాతం(మి.మీ)
పూడూరు : 61.5
మోమిన్‌పేట్ : 60.3
ధారూరు : 46.5
పరిగి : 45.2
కులకచర్ల : 38.8
చౌడాపూర్ : 34.5
బొంరాస్‌పేట్ : 30.3
దోమ : 30.3
నవాబుపేట్ : 30
కోట్‌పల్లి : 28.5
యాలాల : 25.1
కొడంగల్ : 22.5
వికారాబాద్ : 21.1
తాండూరు : 18
దుద్యాల : 15.5
దౌల్తాబాద్ : 15
మర్పల్లి : 13.8
బంట్వారం : 10
పెద్దేముల్ : 8