వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. ప్రతి గింజనూ సేకరించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాసంగికి సంబంధించి జిల్లాలో 90,300 ఎకరాల్లో వరిసాగవ్వగా.. 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. అందుకోసం జిల్లావ్యాప్తంగా 127 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రస్తుతం 114 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు 1704 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
-బొంరాస్‌పేట, మే 18
బొంరాస్‌పేట, మే 18 : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు కూడా ఆలస్యంగా ప్రారంభించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా గురువారం నాటికి 114 కేంద్రాలను ప్రారంభించారు. యాసంగి సీజన్లో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంకాగా, గురువారం నాటికి 1704 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనబోమని చెప్పినా రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకువెళ్తే మార్కెట్, హమాలీ, రవాణా ఖర్చులు పోతాయని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుని లాభం పొందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
వికారాబాద్ జిల్లాలో 127 కొనుగోలు కేంద్రాలు
వికారాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 90,300 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం జిల్లాలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ఆధ్వర్యంలో 66, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, ఐకేపీ 26, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో 4, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 114 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తూకం చేసిన ధాన్యాన్ని నిర్వాహకులు వెంటనే ట్యాబ్‌ల్లో నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
వికారాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం నాటికి కొనుగోలు కేంద్రాల ద్వారా 1704 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించడానికి అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యమున్న జిల్లాలోని నాలుగు బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని అధికారులు నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని బయటి జిల్లాల్లో ఉన్న మిల్లులకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండలస్థాయి అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలతో మేలు
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. మార్కెట్, రవాణా, హమాలీ ఖర్చుల భారం తగ్గుతుంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యాన్ని కొంటున్నారు. వెంటనే ఖాతాల్లో డబ్బులు వస్తున్నాయి. ప్రతిసారి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముతున్నా.
– రవీందర్, రైతు మెట్లకుంట, బొంరాస్‌పేట మండలం
రైతు సంక్షేమం కోసం సీఎం కృషి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి గ్రామాల్లోనే అమ్ముకునే సౌకర్యం కల్పించారు. మా గ్రామంలో కొనుగోలు కేంద్రం లేనప్పుడు రైతులు మార్కెట్లో, దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునేవారు. ఇప్పుడు గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు కావడంతో రైతులంతా ఇక్కడే ధాన్యం అమ్ముతున్నారు.
-శంకర్లింగం, రైతు, కొత్తూరు, బొంరాస్‌పేట మండలం.
సజావుగా కొనుగోళ్లు ..
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు 127 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, 114 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయి. గన్నీ బ్యాగుల కొరత లేకుండా కావాలసినన్ని అందుబాటులో ఉంచాం. ఈ సీజన్లో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు జిల్లాలోని నాలుగు బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. ట్యాబ్‌ల్లో కొనుగోలు వివరాలను నమోదు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం.
-విమల, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్