కొత్తూరు, మే 17: నాలుగేళ్ల చిన్నారిని ఓ ఇటుక లారీ చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ బాలిక లారీ వెనుక టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. పాప తండ్రి ప్రశాంత్‌రెడ్డి, తల్లి దివ్యారెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేసన్ పరిధిలోని నాట్కో జంక్షన్ వద్ద నేషనల్ హైవే 44పై మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
కొత్తూరు సీఐ బాల్‌రాజు వివరాల ప్రకారం..కేశంపేట మండలం పాటిగడ్డకు చెందిన బోయపాడి ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనుచేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటల సమయంలో భార్య దివ్యారెడ్డి, నాలుగేండ్ల పాప ఇవికారెడ్డితో కలిసి తన ద్విచక్ర వాహనంపై కేశంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో జేపీ దర్గారోడ్డు నుంచి నాట్కో జంక్షన్ వద్ద నేషనల్ హైవేపైకి వచ్చారు.
హైదరాబాద్ వైపు మళ్లగానే షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇటుక లారీ వేగంగా వచ్చి వారి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో పాప ఎగిరి ఇటుక లారీ వెనుక టైర్ల కింద పడి శరీరం నుజ్జునుజ్జయింది. దీంతో పాప అక్కడి అక్కడే మృతి చెందింది. పాత తల్లితండ్రులు ప్రశాంత్‌రెడ్డి, దివ్వారెడ్డిలకు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడుపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొత్తూరు సీఐ తెలిపారు. బాలిక తల్లి దివ్యారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.