ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. ఇటీవల ప్రభుత్వం ఇబ్రహీంపట్నానికి కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన సిబ్బందిని కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల కల నెరవేరనున్నది. ఇబ్రహీంపట్నం ప్రస్తుతం వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. దీంతో ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకుండా పోయారు. ఈ పరిస్థితిల్లో ఇబ్రహీంపట్నానికి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ అత్యవసరమని గుర్తించి ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఇబ్రహీంపట్నంతో పాటు సాగర్ రహదారిలోని బొంగుళూరు, మంగల్‌పల్లి, శేరిగూడ వంటి ప్రాంతాల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.
సీఐగా గురునాయుడు
ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా గురునాయుడిని రాచకొండ సీపీ నియమించారు. త్వరలోనే ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డులను కూడా కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మరో వారం రోజుల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ వెనుకగల క్వార్టర్స్‌లో తాత్కాలికంగా ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం క్వార్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు భవనాన్ని పరిశీలించారు.
సాగర్ రహదారి బిజీబిజీ
ఇబ్రహీంపట్నానికి హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వందలాది బస్సులు వస్తున్నాయి. అలాగే ద్విచక్ర వాహనాలపై వేలాదిమంది విద్యార్థులు వచ్చిపోతున్నారు. వీటికి తోడు ప్రైవేటు వాహనాల రాకపోకలతో సాగర్ రహదారి బిజీబిజీగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలల బస్సులు వెళ్లే సమయంలో పెద్దఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది.
మంగల్‌పల్లి, బొంగుళూరు, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. ఇబ్రహీంపట్నంలోనూ సాగర్ రహదారికి ఇరువైపులా రోడ్డుపైనే ద్విచక్ర వాహనాల అక్రమ పార్కింగ్తో పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావటంతో సమసిపోయే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో అక్రమ వాహనాలతో పాటు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
త్వరలో ఏర్పాటు చేస్తాం
ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం త్వరలో ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ప్రతినిత్యం వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడే ప్రయాణికులకు ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రభుత్వం సీఐతో పాటు ఇతర సిబ్బందిని కేటాయించనున్నది.
– శ్రీనివాస్‌రావు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో తీరనున్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేక ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, పాఠశాలల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కష్టాలను తీర్చడం కోసం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– జెర్కోని రాజు, టీఆర్ఎస్వీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు