-మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం పారిశ్రామిక వేత్తలకు సీఎం కేసీఆర్ హామీ..
అన్ని రకాల పరిశ్రమలతో అలరారుతున్న రంగారెడ్డి జిల్లాకు మణిహారంగా గురువారం శంకర్పల్లి మండలం కొండకల్లో సీఎం కేసీఆర్ మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఒక పక్క పారిశ్రామిక ప్రగతి, మరో పక్క అదే స్థాయిలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు మన ప్రభుత్వం చూపిస్తున్న చొరవే కారణం. సీఎం కేసీఆర్ స్వతహాగా అన్ని విషయాలు పర్యవేక్షించడమే కాకుండా ‘మేమున్నామంటూ’ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న హామీతో ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. గురువారం రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం కూడా సీఎం కేసీఆర్ టీఎస్ఐపాస్ పాలసీ గొప్పతనాన్ని వివరిస్తూ.. తెలంగాణ వ్యక్తులు ఏర్పాటుచేసిన పరిశ్రమ విదేశాలకు విస్తరించడం గర్వకారణంగా ఉందని, పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తామని వాగ్దానం చేయడం..వారిలో మరింత ైస్థెర్యాన్ని నింపింది. ప్రభుత్వం చూపుతున్న చొరవ కారణంగా కొత్త పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రావడమే కాకుండా, ఉన్న పరిశ్రమలను మరింత విస్తరించేందుకు దోహదమవుతున్నది. ప్రస్తుతానికి మొదటి దశ ప్రారంభించిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో మరో రెండు దశల్లో విస్తరించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అద్భుత ఫలితాలనిస్తున్న ప్రభుత్వ విధానాలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా రూపురేఖలు మారుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడేవారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులొచ్చే వరకూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అం దిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాదు రంగారెడ్డి జిల్లాలోనూ పారిశ్రామిక విజయం సాధ్యమైంది. పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది. పెద్ద, పెద్ద కంపెనీలు ఈ ప్రాం తంలో తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు క్యూ కడుతుండగా..దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండగల్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్స వం చేసుకున్నది. టీఎస్-ఐపాస్‌తో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం..అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి చర్యలతో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నదన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటైన తొలి రోజుల్లో పరిశ్రమల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. పరిశ్రమలన్నీ పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని నేతలు గగ్గోలు పెట్టారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప దార్శనికత, పక్కా ప్రణాళిక, పటిష్టమైన ఆచరణతో టీఎస్-ఐపాస్‌ను తీసుకొచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన నెల రోజుల్లోనే స్థానికంగా ఉన్న అన్ని పారిశ్రామిక సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశమై పరిశ్రమల ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితిని తొలగించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చి ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. పరిశ్రమలకు అవసరమైన కరెంటు, నీళ్లు, భూమి సమకూర్చి భరోసా కల్పించారు. ఫలితంగా అనేక పరిశ్రమలు రాష్ర్టానికి క్యూ కట్టుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డాగా మారింది. ఫలితంగా తొమ్మిదేండ్లలో రూ.47,062 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమలు జిల్లాలో స్థాపించబడి 5,15,851 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రాష్ర్టానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో జిల్లా పెట్టుబడులు 32 శాతంగా నమోదై రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరుగడం, తగినంత మ్యాన్ పవర్ లభిస్తుండటం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతుండటం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భ జలాలు దండిగా ఉండటం వంటి అంశాలు పారిశ్రామిక వేత్తలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మార్కెటింగ్, రవాణాకు ఈ ప్రాం తం అనువుగా ఉంది. గోదాంలు, కోల్డ్ స్టోరేజీలు, రైస్‌మిల్లులు, సీడ్ ప్రాసెసింగ్, టీవీ, మొబైల్స్ తయారీ, ప్యాకింగ్ కంపెనీ వంటి యూనిట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, బోయింగ్, విప్రో, ఫాక్స్‌కాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు అనేకం రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విరివిగా వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తు న్న ఏకైక ప్రభుత్వం మనదే. ఇప్పటికే హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. -గోవర్ధన్‌రెడ్డి, శంకర్పల్లి మండలం
ఏర్పడిన కొద్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు రా ష్ర్టానికి వస్తున్నాయి. టీఎస్-ఐపాస్‌తో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపే ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుమతులిస్తున్నది.
-రవీందర్ గౌడ్, మిర్జాగూడ గ్రామం,శంకర్పల్లి
సీఎం కేసీఆర్ హయాంలో తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటం హర్షణీయం. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో మండలంలోని కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పలువురు ఔత్సాహికులు ముందుకొచ్చారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి దొరకడంతోపాటు ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందడం ఖాయం
-ఫరీద్, మోకిల, శంకర్పల్లి మండలం
ఈ ప్రాంత ప్రగతికి గుదిబండగా మారిన 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం తో ఇక్కడ ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నది. ప్రభుత్వం భూమి ఇవ్వడంతో అతిపెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ప్రారంభించడం గొప్ప పరిణామం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరు గుతాయి -వాసుదేవ్‌కన్నా, శంకర్పల్లి
హైదరాబాద్ నగరానికి మండలం దగ్గరగా ఉన్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జీవో 111 రద్దు చేయడంతో ఇక్కడ పెద్ద, పెద్ద కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నా యి. రూ. వేల కోట్లతో ఏర్పాటు చేసిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం సంతోషకరం.
-వెంకట్‌రెడ్డి, ప్రొద్దుటూరు, శంకర్పల్లి మండలం
సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. 111 జీవోను ఎత్తివేయడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ఊహిం చ స్థాయిలో అభివృద్ధి చెందనున్నది. త్వరలోనే దేశీ య, అంతర్జాతీయ సంస్థలు తమ బ్రాంచీలను ఏర్పా టు చేయనున్నాయి. సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. ఆయన అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు.
– కురుమ వెంకటేశ్, మిర్జాగూడ, శంకర్పల్లి
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో త్వరలోనే పెద్ద, పెద్ద కంపెనీలు ఏర్పాటై మండలం పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందడం ఖాయం. కంపెనీల ఏర్పాటుతో ఇక్కడున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
-రాఘవేందర్‌రెడ్డి, మహాలింగాపురం, శంకర్పల్లి మండలం