శంకర్పల్లి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు దేశమొల్ల ఆంజనేయులు అన్నారు. సోమవారం శంకర్‌పల్లిలో ఆయన శాంతియుత దీక్షలో పాల్గొ్న్నారు.
ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలో కూడా పెట్టారని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఉద్యమకారుకులకు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం ఉద్యమకారులను అవమానపర్చడమేనని అన్నారు.
స్థలం వస్తుందనే ఆశతో తెలంగాణ ఉద్యమకారులం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ఉద్యమకారుల సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపిస్తామని, మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శంకర్పల్లి మండల అధ్యక్షుడు అశోక్, పద్మ, ప్రతాప్‌రెడ్డి, పండిత్ రావు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.