వికారాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో లంచమిస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏసీబీ దాడులు జరిగి పట్టుబడుతున్నా పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే అండ్ భూరికార్డులు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో చెయ్యి తడపనిదే పనులు జరగని దుస్థితి నెలకొన్నది. పలు శాఖల్లోని ఉన్నతాధికారులు విధిస్తున్న టార్గెట్ల కోసం లంచాలు తీసుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు పేర్కొంటుండడం గమనార్హం. అయితే జిల్లాలో గత ఆరు నెలల్లో ఏకంగా ఏడుగురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారంటే జిల్లాలో లంచాలు ఏ రేంజ్లో తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
లంచమిస్తేనే పనిని చేస్తామనేలా తయారయ్యారు కొందరు ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. భూ సమస్యల పరిష్కారంలో రైతుల నుంచి రెవెన్యూ యంత్రాంగం అందిన కాడికి దండుకుంటున్నదన్న ఆరోపణలున్నాయి. భూ సమస్యల పరిష్కారంలో ఆర్ఐ రిపోర్ట్, తహసీల్దార్ అప్రూవల్ తప్పనిసరి కావడంతో చాలా మండలాల్లో డబ్బులిస్తేనే పనులను చేస్తున్నారని.. లేకుంటే ఏదో ఒక కొర్రీ పెట్టి దానిని రిజెక్టు చేసేలా రిపోర్టులు పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ఆపరేటర్లతో రిపోర్టులు రెడీ చేస్తున్న రైతుల వివరాలను తెలుసుకొని బేరసారాలు చేస్తూ రిపోర్టులు పంపుతున్నట్లు తహసీల్దార్ కార్యాలయాల వద్ద జోరుగా ప్రచారం జరుగుతున్నది.
రిజిస్ట్రేషన్లకు వచ్చే వారిని సైతం తహసీల్దార్లు వదలడం లేదని.. ఉదయం స్లాట్ ఉన్నా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. వైద్యారోగ్య శాఖలోనూ అవినీతి పెరిగిపోయిందనే ప్రచారం జోరందుకున్నది. వైద్యారోగ్యశాఖ కార్యాలయంతోపాటు క్లినిక్‌ల తనిఖీ, సీజ్‌ల పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అర్హత లేని ఓ అధికారి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానను తనిఖీ చేసి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సంతకం పెట్టి రావడం, ఆ తర్వాత విషయం సదరు డిప్యూటీ డీఎంహెచ్‌వోకు తెలిసి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇలా తనిఖీలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అవినీతి పెరిగిపోయింది. అధికారులు ప్రతి రిజిస్ట్రేషన్‌కూ డబ్బులిస్తేనే సంతకాలు చేస్తున్నారని..వారు నేరుగా కాకుండా ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకున్నది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లోనూ ప్రతి పనికీ కమీషన్ ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొన్నది. ఆయా శాఖలను బట్టి 5శాతం, 3, 2 శాతం మేర కమీషన్ ముట్టజెప్పాల్సిందే. డబ్బులివ్వకపోతే నెలల తరబడి సదరు అధికారి లేదా ఉద్యోగి చుట్టు తిరగాల్సిందే. మున్సిపల్ శాఖలో చివరకు చెక్కుపై సంతకం చేయాలన్నా రూ.2 వేలు ఇస్తేనే సంబంధిత ఉద్యోగులు సంతకం పెడుతున్నట్లు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
జిల్లా పంచాయతీరాజ్ శాఖలో పై అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఎంత పర్సంటేజీ ఇవ్వాలనేది ముందే చెబుతారట. ఎవరైనా ప్రజాప్రతినిధితులతోగాని తదితరులతో ఫోన్ చేయిస్తే వారి ఫైల్‌ను పక్కన పెట్టుతారనే ఆరోపణలున్నా యి. అదేవిధంగా అటవీ శాఖలోనూ ప్రతి రేంజ్ నుంచి ఆ శాఖఉన్నతాధికారులకు ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలనే టార్గెట్లు ఉంటాయని సమాచారం. జిల్లాలో ఐదు రేంజ్లుండగా, ఒక్కో రేంజ్ నుంచి ప్రతినెలా రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆ శాఖ ఉన్నతాధికారికి అందుతాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.