ఓటర్లతో మమేకమవుతున్న తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం గడపగడపకూ వెళ్లి మ్యానిఫెస్టోను చూపుతూ ఓట్ల అభ్యర్థన సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ప్రజలు
తాండూరు, అక్టోబర్ 29: అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పంజుగుల రోహిత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు జనంలోకి వెళ్తున్నారు. తాండూరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కదన రంగంలోకి దిగారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా వారికి మద్దతుగా సతీమణి ఆర్తిరెడ్డి, తల్లి ప్రమోదినీదేవి, తండ్రి విఠల్‌రెడ్డి, బాబాయ్ శ్రీశైల్రెడ్డితోపాటు బంధుమిత్రులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని గడపగడపకూ వెళ్లి పార్టీ మ్యానిఫెస్టోను చూపుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.
మహిళలకు బొట్టు పెట్టి, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ, యువతకు అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. తాండూరులో రోహిత్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ప్రజలపై చూపించిన ఆత్మీయత, అనురాగంతో స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. వార్ వన్‌సైడేనని.. రోహిత్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.