రంగారెడ్డి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఈ రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు ప్రజలకు భారంగా మారింది. కొన్ని సార్లు చికిత్స కన్నా టెస్టులకే అధికంగా ఖర్చవుతున్న దాఖలాలూ లేకపోలేదు. దీంతో ఎంతోమంది పేదలు ఖర్చుకు భయపడి పరీక్షలు చేయించుకోకపోవడంతో వ్యాధి ముదిరి వారికి ప్రాణాంతకంగా మారుతున్నది. దీన్ని గమనించిన రాష్ట్ర సర్కార్ టీ డయాగ్నస్టిక్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తూ ఉచిత సేవలు అందిస్తున్నది. ఇటీవలే కొండాపూర్ ఏరియా దవాఖానలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభించగా.. ఇక్కడ కరోనా, బీపీ, షుగర్, తలసేమియా, హీమోఫీలియా, అనీమియా, హెచ్ఐవీ తదితర టెస్టులన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్‌రే, యూసీజీ, 2డీ ఎకో, మామోగ్రామ్, మహిళలకు సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు, హైఎండ్ ఆల్ట్రా సౌండ్ వంటి ఖరీదైన స్కానింగ్లనూ పైసా ఖర్చులేకుండా చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చిన శాంపిల్స్‌ను ఇక్కడ ప్రాసెస్ చేసి 24 గంటల్లోనే ఫలితాలను రోగుల సెల్ఫోన్లకు పంపిస్తున్నారు. కార్పొరేట్ దవాఖానాల్లో అందుబాటులో ఉండే అత్యాధునిక యంత్రాలన్నీ ఈ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ఉన్నాయి. నాణ్యమైన వైద్య సదుపాయాలతో రంగారెడ్డి జిల్లా హెల్త్‌హబ్‌గా మారింది. ఉచిత సేవలతో ప్రజలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి చెక్ పడింది.
అందరికీ వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభంతో రంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి అందుతున్న వైద్య సేవల్లో మరో కీలక అడుగు పడిం ది. వివిధ టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ ల్లో రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుండగా.. టీ డయాగ్నస్టిక్ ల్యాబ్ ద్వారా ఏకంగా 134 రకాల వైద్య పరీక్షలతోపాటు ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ వంటి రేడియాలజీ టెస్టులు కూ డా పూర్తి ఉచితంగా లభించనున్నాయి. ఈ సేవల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.రెండు కోట్ల వరకు వెచ్చించింది. ప్రభుత్వ దవాఖానల్లోనే పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హెల్త్ హబ్‌గా మారింది.
అందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నది. చిన్న పరీక్షలకు కూడా ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ దవాఖానలను డెవలప్ చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలోనూ డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తుండగా.. తాజాగా రంగారెడ్డి జిల్లాలోనూ ఈ సేవలు అందుబాటులో కి వచ్చాయి. జూలై 1న రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని కొండాపూర్ ఏరియా దవాఖాన లో టీ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏర్పాటైన ల్యాబ్‌ల్లో 57 రకాల పరీక్షల ను ఉచితంగా అందిస్తుండగా..ఇక నుంచి ఈ ల్యాబ్‌ల్లో అందించే టెస్టుల సం ఖ్యను 134కు పెంచారు. వీటితోపాటు పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్‌లూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
నాణ్యమైన వైద్య సేవలు
రంగారెడ్డి జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. కొండాపూర్ దవాఖానను ప్రభుత్వం జిల్లా దవాఖానగా అప్ గ్రేడ్ చేసి వంద పడకల సామర్థ్యానికి పెం చింది. రెండు ఆక్సిజన్ ప్లాంట్లు, రెండు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, రెండు వెంటిలేటర్ల సదుపాయాన్ని కల్పించింది. కరో నా వ్యాధి చికిత్సలకు సైతం 120 పడకల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలోనూ ఆక్సిజన్ ప్లాం ట్లు, డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల దవాఖానల్లోనూ డయాలసిస్ సేవలు అందుతున్నాయి. గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానలోనూ 1200 పడకల సామర్థ్యంతో ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. బస్తీల్లో 59 బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాంతాల్లో తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు 24 పట్టణ ఆరోగ్య కేం ద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 82 పల్లె దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. ఒకప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవే ట్ దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. అధికంగా డబ్బులు ఖర్చు అయ్యేవి . ఇది సామాన్య ప్రజలకు పెను భారంగా ఉండేది. ఆ పరిస్థితులకు నేడు ప్రభుత్వ దవాఖానలు చరమగీతం పాడుతున్నాయి. 24 గంటలూ ప్రభు త్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి.
24 గంటల్లోనే టెస్టుల రిపోర్టులు
పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకడుగు వేయకుండా డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నది. కొండాపూర్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో కరోనా పరీక్షలతోపాటు బీపీ, షుగర్ వంటి సాధారణ వ్యాధులతోపాటు అనీమియా, హెచ్ఐవీ, 2డీ ఇకో, వైరల్ లోడ్ తదితర టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రేడియాలజీ సేవల ద్వారా ఎక్స్‌రే, యూసీజీ.. మహిళలకు సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు, హై ఎండ్ ఆల్ట్రాసౌండ్ వంటి ఖరీదైన స్కానింగ్‌లను ఉచితంగా చేయనున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చిన శాంపిళ్లను కొండాపూర్ టీ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి 24 గంటల్లోనే పరీక్షా ఫలితాలను అందిస్తున్నారు. సంబంధిత రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. కార్పొరేట్ దవాఖానల్లో అందుబాటులో ఉండే అత్యాధునిక యంత్రాలన్నీ కొండాపూర్‌లోని డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయి.