కడ్తాల్, డిసెంబర్ 29 : నిత్య సాధనతో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని.. ఆత్మజ్ఞానంతో ఆనందమయ జీవితాన్ని గడపొచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ది పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరాయి.
ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ప్రాఃతకాల ధ్యానంలో ఆధ్యాత్మిక గురువులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్దేశించి స్వర్ణమాల పత్రీ మాట్లాడుతూ ధ్యానులందరినీ సుభాష్ పత్రీజీ తండ్రిలాగా అక్కున చేర్చుకున్నారని తెలిపారు. పత్రీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన స్థాపించిన ధ్యాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. శాఖహార జగత్ కోసం పత్రీజీ ఎనలేని కృషి చేశారన్నారు.
అనంతరం పరిమళ పత్రీ, పరిణిత పత్రీ మాట్లాడుతూ నిత్యం ధ్యాన సాధనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని.. సత్యం మాట్లాడే వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.
ధ్యాన మహాయాగాల సందర్భంగా పత్రీజీ శక్తిస్థల్ వద్ద ధ్యానులు మౌనంగా నివాళులర్పించారు. పిరమిడ్ అభివృద్ధికి కరీంనగర్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి, నాగభూషణం రూ.లక్ష, వేంపల్లికి చెందిన సూర్యప్రకాశ్‌రావు రూ.లక్ష, భారతీదామోదర్రెడ్డి రూ.25 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం రట్టి మధుసూదన్, విజయనగరం జిల్లాకు చెందిన శ్యామల రచించిన ఆహార ధర్మం, ధ్యాన పరిజ్ఞాన దీపిక పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ధ్యానసభా వేదికపై కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరిస్తున్నాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మ న్ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు హన్మంతురాజు, సాంబశివరావు, రాఘవరావు, రాంబాబు, శ్రీరామ్‌గోపాల్, శివప్రసాద్, మాధవి, దామోదర్‌రెడ్డి, జయలక్ష్మి, కిషన్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాము, నవకాంత్ పాల్గొన్నారు.