రంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే అరకొరగా సాగుతున్నది. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు, 549 గ్రామపంచాయతీలుండగా.. 5,57,000 కుటుంబాలున్నాయి. ఈ ఇండ్లను సర్వే చేసేందుకు ప్రభుత్వం 5,344 మంది ఎన్యూమరేటర్లను నియమించింది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కు టుంబాల సంఖ్య అధికంగా ఉండడంతో వార్డు ఆఫీసర్లకు ఒక్కొక్కరికీ అదనంగా పదిమంది చొప్పున ఔట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. వీరిలో చాలామందికి శిక్షణే లేదు. వారు సర్వే కోసం ఇండ్ల వద్దకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వే ఫారంలోని మొత్తం 75 ఖాళీలను నింపేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రజలు, రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సర్వే ప్రారంభమైంది.
జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పత్తి ఏరుట, వరి కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, కూలీలు ఉదయమే పొలాల్లోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సర్వే కోసం ఇండ్ల వద్దకు వచ్చిన ఎన్యూమరేటర్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. ఎన్యూమరేటర్లు రాత్రివేళ ల్లోనూ ఇండ్ల వద్దకెళ్లి సర్వే చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కనిపించని ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు..
సమగ్ర కుటుంబ సర్వేలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని సక్సెస్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నా మొదటి రోజు జిల్లాలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పాల్గొన లేదు. చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నా సర్వేకు దూరంగా ఉన్నారు. అలాగే, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లూ వెళ్లలేదు. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మాత్రమే సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.
బడంగ్‌పేటలో 300 బ్లాక్‌ల ఏర్పాటు..
జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో జనాభా అధికంగా ఉండడంతో సర్వేకు అవరోధం కలుగుతున్నది. మున్సిపాలిటీల్లో మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వార్డు ఆఫీసర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చారు. కాగా, కుటుంబాల సంఖ్య అధికంగా ఉండడంతో పని భారాన్ని తగ్గించేందుకు అధికారులు వార్డు ఆఫీసర్లకు ఒక్కొక్కరికీ అదనంగా పదిమంది చొప్పున ఔట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. వీరిలో చాలామందికి శిక్షణే లేదు. సర్వే త్వరగా పూర్తి అయ్యేందుకు అధికారులు ఒక్కో మున్సిపాలిటీని 100 నుంచి 300 వరకు బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యూ మరేటర్ అవసరం. అంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయడం కష్టం కావడంతో.. వార్డు ఆఫీసర్లకు ఒక్కొక్కరికీ అదనంగా పదిమంది చొప్పున ఔట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. తుర్కయాంజాల్‌లో 194 బ్లాక్‌లు, ఇబ్రహీంపట్నంలో 100 బ్లాక్‌లు, మీర్‌పేటలో 190 బ్లాక్‌లు, బడంగ్‌పేటలో 300 బ్లాక్‌లు, షాద్‌నగర్‌లో 160 బ్లాక్‌లున్నాయి. ఈ బ్లాక్ల్లోని ఇండ్లలోకి సర్వే కోసం వెళ్లే ఔట్సోర్సింగ్ సి బ్బంది..సరైన శిక్షణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వే ఫారంలోని మొత్తం 75 ఖాళీలను నింపేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అంతేకా కుండా ప్రజలు, రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. వ్యక్తిగత, ఆర్థికపరమైన విషయాలను ప్రజలు చెప్పడంలేదు. దీంతో కుటుంబ సమగ్ర సర్వే అరకొరగా సాగుతున్నది.
సర్వేతో ఒరిగేదేమీలేదు..
ఇరవై ఏండ్లుగా ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో జీవిస్తున్నాం. రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాం. రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఎన్నికల్లో విజయం సాధించి, వాటిని అమలు చేయడం లేదు. రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టినా ఇప్పటికీ ఇవ్వలేదు. పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం ఇలాంటి సర్వేలు చేస్తే బాగుంటుంది. సర్వేతో ఒరిగేదేమీ లేదు.
– రిజ్వానా, ఇబ్రహీంపట్నం
రేషన్‌కార్డులు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు..
ఔట్సోర్సింగ్ విధానంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నా. ఇండ్ల వద్దకెళ్లి బ్యాంకు లావాదేవీలు, పట్టా పాస్‌బుక్కులు, ఆర్థికపరమైన అంశాలు అడిగితే ఎవ్వరూ చెప్పడంలేదు. చాలామంది రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు.
-జయచంద్ర, ఎన్యూమరేటర్