వికారాబాద్, ఆగస్టు 13 : సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్ చేస్తూ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు.
గతంలో కూడా దాసోజు శ్రవణ్ ఒక ఉద్యమ నేతగా సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ కోదండరామ్‌కు సైతం లేఖ రాశారని గుర్తు చేశారు. న్యాయం కోసం గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. సుప్రీం తీర్పుతోనైనా రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం జరగాలని ఆశిస్తున్నామన్నారు.