రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు కారణంగా జిల్లాలో జరిగిన ఆస్తి, ప్రాణ, పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నివేదికలను రూపొందించాలని తెలిపారు. టెంపరరీ పునరుద్ధరణ నివేదికను కూడా సమర్పించాలన్నారు. వర్షాలు పడినప్పుడు వాగులు, చెరువులు ఉప్పొంగినప్పడు చోటుచేసుకున్న సంఘటనలు వివరాలు సమర్పించాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండి పరిస్థితులు పరిశీలించాలని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగే వాటిని గుర్తించాలని, అకడ అధికారులను నియమించి ఎలాంటి ప్రమాదాలు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించడానికి కృషి చేయాలని సూచించారు.
వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, డీపీవో సురేశ్మోహన్, సీపీవో సౌమ్య, వ్యవసాయ అధికారి నర్సింహా రావు, ఇరిగేషన్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.