సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీజీపీఎస్సీ వద్ద భారీ బందోబస్సు ఏర్పాటు చేయడమే కాకుండా..నగరం నలుమూలల నుంచి నాంపల్లి వైపు వెళ్లకుండా నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు.. నిరుద్యోగులతో పాటు రైతులు, జర్నలిస్టులు, సామాన్యులను సైతం వదలేదు.
ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, చిక్కడపల్లి, అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిఘా పెట్టి నిరుద్యోగ యువత బయటకు వెళ్లకుండా ఉండేలా కట్టడి చేశారు. ఇలా నిర్బంధకాండ కొనసాగుతున్నా.. ఛేదించుకొని.. నిరుద్యోగులు టీజీపీఎస్సీకి చేరుకోవడంతో పోలీసులు ఆగ్రహంతో ఊగిపోయారు. దొరికినవారిని దొరికినట్లు ఈడ్చుకెళ్లి.. అరెస్టు చేశారు. పోలీసుల అనుసరించిన వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అరెస్టు చేయడం సరికాదు
ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, గ్రూప్ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
-బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు మిద్దె సురేశ్
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు
నిరుద్యోగులు తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అరెస్టులు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. హామీని వెంటనే అమలు చేయాలి.
-నిరుద్యోగి శ్రీనివాస్