యాచారం, ఆగస్టు 12 : ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి గురువారం ధర్నా చేపట్టగా.. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నెలకొన్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామస్తులతో కలిసి నినాదాలు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించొద్దని భీష్మించుకూర్చున్నారు. గతంలో 19 మంది ఉపాధ్యాయులుండగా.. ఐదుగురు డిప్యూటేషన్‌పై వెళ్లగా ప్రస్తుతం మరో ఇద్దరిని డిప్యూటేషన్‌పై పంపిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఉన్న 12 మందిలో ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఒక పీఈటీ, ఒక రికార్డు అసిస్టెంట్ ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో ఉన్నత పాఠశాలలో కేవలం 9 మంది మాత్రమే టీచర్లు ఉన్నట్లు తెలిపారు.
ఎన్ని మార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దు చేసేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం నాయకులు, గ్రామస్తులు కలిసి కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చా బాషా, సీపీఎం మండల కార్యదర్శి నరసింహ, మాజీ సర్పంచ్ కృష్ణ, స్వచ్ఛంద కార్యకర్త రవీందర్‌గుప్తా, నాయకులు కుమార్, సంపత్, మధుకర్‌రెడ్డి, శివమోడి, జంగయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.