హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఒకవైపు ఏటా రిటైర్మెంట్లతో సిబ్బంది సంఖ్య పడిపోతుండగా.. మరోవైపు కొత్త నియామకాలు ఆశించిన స్థాయిలో జరుగడం లేదు. 2023-24లో 41,837 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 39,724కు పడిపోయింది. మూడేండ్ల వ్యవధిలోనే 2,113 మంది తగ్గారు. సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 37,478 ఉండగా ఎగ్జిక్యూటివ్ క్యాటగిరీలో 2,246 చొప్పున మొత్తంగా 39,724 మంది పనిచేస్తున్నారు.
ఇక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో మరో 27,345 మంది చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పేరిట గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల కాలంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 3,200 మాత్రమే. డిపెండెంట్ ఉద్యోగాల కోసం మరో 400 మంది వరకు వేచిచూస్తున్నారు. మెడికల్ అన్ఫిట్ కేసులను తేల్చడం లేదు. ప్రస్తుతం సింగరేణి మూడు కొత్త గనులను చేపట్టనున్నది. ఒడిశాలోని నైనీ కోల్బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యింది. తాడిచెర్ల -2 కోల్ బ్లాక్, సత్తుపల్లి ఓసీ -3ని సింగరేణి సంస్థ ఇటీవలే దక్కించుకున్నది. సంస్థ విస్తరణ నేపథ్యంలో ఉద్యోగుల అవసరం పెరుగుతున్నది. అయినా కొత్త నియామకాలపై అటు సంస్థ, ఇటు సర్కార్ దృష్టి పెట్టడం లేదు.
మానవ వనరుల పెంపునకు ముందస్తు ప్రణాళికలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటంపై సింగరేణికి చెందిన ఓ అధికారి స్పందిస్తూ గనుల సంఖ్య తగ్గుతుండటంతోనే కార్మికుల సంఖ్య తగ్గుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో 56 గనులుండగా ప్రస్తుతం 38కి పడిపోయిందని, కొత్త కోల్బ్లాక్లకు అనుమతులొచ్చినా.. బొగ్గు ఉత్పత్తి చేసేందుకు నాలుగేండ్ల వరకు పడుతుందని తెలిపారు.
కేసీఆర్ హయాంలో 19 వేల ఉద్యోగాల భర్తీ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు సింగరేణిలో ఉద్యోగాల భర్తీని పక్కన పెట్టాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను పెద్దఎత్తున పోషించాయి. తెలంగాణ రాకపూర్వం పదేండ్లలో భర్తీచేసిన ఉద్యోగాలు కేవలం 6,453 మాత్రమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో 19,463 ఉద్యోగాలను భర్తీచేశారు. అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలను భర్తీచేసింది. కారుణ్య నియామకాల కింద 15,256 మంది వారసులకు ఉద్యోగాలు దక్కాయి.
ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 4,207 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్నల్ అభ్యర్థులకు ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా 3,490 మందికి ఉద్యోగాలు దక్కాయి. 11,685 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసింది. 2015-16 కాలంలో సింగరేణిలో 58,491 మంది ఉద్యోగులు పనిచేసేవారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోతే సింగరేణిలో మొత్తం ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 15 వేలకు పడిపోయేది.