మొయినాబాద్, నవంబర్ 10 : మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళాశాలలుండటంతో నగరం నుంచి, వికారాబాద్ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ప్రధానంగా నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కళాశాలలకు వస్తుంటారు. బస్ సర్వీస్‌లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు కళాశాలకు వచ్చి వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. కళాశాలకు వచ్చేటప్పుడైనా, ఇంటికి వెళ్లేటప్పుడైనా విద్యార్థులు బస్సుల్లో కిక్కిరిసి వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
బస్సుల్లో సామర్థ్యానికి మంచి ప్రయాణికులు ఎక్కడంతో డ్రైవర్లు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్‌లు ఏర్పాటు చేయడంతోపాటు బస్ సర్వీస్‌లు పెంచాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. బస్ సర్వీస్‌లు సక్రమంగా లేకపోవడంతో కొందరు మహిళలు ఆటోలు, క్యాబ్‌లు బుక్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. గంటల తరబడి బస్‌ల కోసం బస్ స్టాపుల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్ సర్వీస్‌లు పెంచి విద్యార్థులు తిప్పలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.