Moinabad | మొయినాబాద్, మార్చి26 : పొలం వద్ద ఉన్న మేకలపై వీధి క్కులు దాడి చేసి దారుణంగా చంపాయి. మొన్న ఆరు మేకలపై దాడి చేస్తే నేడు ఐదు మేకలపై దాడి చేశాయి. మేకలపై వీధి కుక్కలు విజృంభిండంతో ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి గోపాల్‌కు సంబంధించిన ఐదు మేకలను మూసీ నది పక్కన ఉన్న తన పొలంలో మేకలను కట్టేసి పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సుమారుగా 10 కుక్కల వరకు వచ్చి కట్టేసిన మేకల మీద దాడి చేసి గొంతు పట్టి రక్తం తాగి చంపేశాయి. మేకలు అరుస్తుండగా పొలంలో పనులు చేస్తున్న గోపాల్ వచ్చే సరికి 5 మేకలను గొంతు పట్టి చంపేశాయి. సుమారుగా రూ.50 వేల వరకు గోపాల్‌కు నష్టం జరిగింది. అదే విధంగా గత నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గూడం మల్లేష్ పొలం వద్ద దొడ్డిలో 6 మేకలను కొట్టి పొలంలో పనులు చేసుకుంటున్నాడు. మనుషులు ఎవరు లేనిది చూసిన వీధి కుక్కలు ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేసి 6 మేకల గొంతు పట్టి చంపేశాయి. ఎవరు లేని సమయంలో మేకలను పట్టి చంపడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వీధి కుక్కలు గ్రామంలో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నగరం నుంచి తీసుకొచ్చి వీధి కుక్కలను గ్రామంలో వదిలి పోతున్నారని, గ్రామంలో సుమారుగా 30 వరకు వీధి కుక్కలను వదిలారని గ్రామస్తులు చెబుతున్నారు. మూగ జీవాలను చంపేస్తున్నాయని, వీధుల్లో చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు వస్తే ఎప్పుడు దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. గుంపులు గుంపులుగా ఒక్క సారి దాడి చేస్తున్నాయని చెబుతున్నారు. కావున అధికారులు వెంటనే అప్రమత్తం అయి చిన్న పిల్లల మీద దాడి చేయక ముందే వీది కుక్కలను గ్రామంలో నుంచి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.