వికారాబాద్, జనవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్‌గౌడ్ అన్నారు. ఆదివారం వికారాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపి నివాళులర్పించారు. అనంతరం బీజేఆర్ చౌరస్తాలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.
రైతు భరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని రైతులను నమ్మించి.. రూ.12వేలు వేస్తామనడం సరికాదన్నారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని రైతులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, స్పీకర్ ఇంతవరకు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. వుడా పేరుతో నాలుగు నియోజకవర్గాల మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని అబద్దపు ప్రచారాలు మానుకోవాలన్నారు. గత సంవత్సరం నుంచి వికారాబాద్ ప్రాంతానికి ఒక్క అభివృద్ధి పనికీ నిధులు, పనులు పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా యువ నాయకులున్నారు.