మంచాల, మార్చి 8 : వ్యవసాయం దండుగ అన్న వారికి పండుగలా చేసి చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. బీడు భూములు సాగులోకి తేవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాన నిలబడి రైతుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు కేటాయించి వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు రాజు చేయాలనే లక్ష్యంతో వారికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు.
ఒకనాడు నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయం చేసే రైతులు కూలీలుగా ఇతరుల వద్దకు పనికోసం వెళ్లేవారు. సమైక్యాంధ్ర పాలనలో ఉన్న నాయకులు రైతులను ఏనాడు పట్టించుకోకపోవడంతో వ్యవసాయానికి ఎంతో మంది రైతులు దూరంగా ఉండేవారు. కానీ నేడు అడుగంటి పోయిన భూగర్భజలాలను పైకి తీసుకురావడం కోసం ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడమే కాకుండా ఎన్నో ఏండ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని చెరువులను మరమ్మతులు చేయడంతో నేడు వర్షపు నీరు మొత్తం వృథాగా పోకుండా చెరువులు, కుంటల్లోకి చేరడంతో అవి నిండుకుండలా మారడంతో భూగర్భజలాలు ఒక్కసారిగా పెరిగాయి.
మంచాల మండల రైతులు వరి సాగుపైనే దృష్టి పెట్టడంతో గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని వరి పంటపొలాలు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించడమే కాకుండా సబ్సిడీపై ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ సాగుకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ రైతులకు వ్యవసాయంపై పూర్తి స్థాయిలో భరోసా కల్పించారు. మండలంలో భూగర్భ జలాలు పెరుగడంతో గతంలో వృథాగా ఉన్న వ్యవసాయ బావుల్లో కూడా మోటర్లు బిగించి సాగుచేయడంతో అదే స్థాయిలో విద్యుత్ కనెక్షన్లు కూడా పెరిగాయి.
వ్యవసాయానికి నిరంతరంగా 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో రైతంగానికి అత్యధిక మేలు చేకూరింది. మండలంలో గతంలో 3వేల 2 వందల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే.. నేడు 5సబ్స్టేషన్ల కింద 5వేల 4వందల విద్యుత్ కనెక్షన్లు కొత్తగా పెరిగాయి. అయినా కూడా కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ బావులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు. మార్చిలోనే ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారు.
మండలంలో పంటలసాగు విస్తీర్ణం భారీగా పెరుగడంతో అందుకు అనుగుణంగా విద్యుత్ అవసరం కూడా పెరుగుతూ వచ్చింది. గతంలో 5వేల 5వందల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసుకుంటే యాసంగిలో వరి 7వేల 5వందల ఎకరాలు, కూరగాయల సాగు 3వందల ఎకరాలు, పండ్ల తోటలు 5వందల 50ఎకరాలు సాగుచేసుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కరియడంతో చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీళ్లు రావడంతో రైతులు తమ బీడు భూములు సైతం కూడా సాగు చేసుకుంటున్నారు.
వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాను చేస్తున్నాం. ఎండలు పెరిగిపోవడంతో విద్యుత్ డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. మండలంలో మంచాల, బోడకొండ, జాపాల, ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఎండాకాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడంతో చిన్నచిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కానీ రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నాం.
– సత్యనారాయణ, ఏఈ
వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తుండడంతో 5ఎకరాల్లో వరిని నాటిన. సీఎం కేసీఆర్ సార్ తనకు వ్యవసాయ పెట్టుబడులకు సాయం చేయడమే కాకుండా ఉచిత విద్యుత్‌ను ఇవ్వడంతో తన పొలంలో నాటిన వరిచేనుకు నీరు పారుతుందని గతంలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఇప్పుడు 24 గంటలూ కరెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి సార్‌కు రైతులు రుణపడి ఉంటారు.
– సేవ్యానాయక్, రైతు