వికారాబాద్, డిసెంబర్ 11: 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధి కారులతో కలిసి త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్ బూత్ వారీగా విస్తృతస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం పట్ల సీఈవో జిల్లా కలెక్టర్లను ఈ సందర్భంగా అభినందించారు. ఇదే తరహాలో త్వరలో జరుగ నున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేప ట్టాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ పాల్గొన్నారు.