మియాపూర్ , మార్చి 3 : మియాపూర్ ఠాణా పరిధిలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వ్యవహారమే సదరు యువతి ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ గ్రామానికి చెందిన మేఘావత్ సోనిబాయి(20) మియాపూ మక్తలోని ఫస్ట్ హెల్త్ ల్యాబ్‌లో ఏడాది కాలంగా స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నది. సమీపంలోని రెడ్డి ఎన్‌క్లేవ్‌లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటోంది. అయితే సోమవారం సోని విధులకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండగా..తోటి వారంతా తమ విధులకు వెళ్లారు. విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చిన స్నేహితులు సోని గది తలుపులు వేసి ఉండటాన్ని గుర్తించారు.
ఎంత పిలిచినా పలకకపోవటంతో హాస్టల్ యాజమాన్యం కిటికిలోనుంచి చూడగా..అప్పటికే చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. గది తలుపులు పగుల గొట్టి లోపలికి వెళ్లి సోనిని కిందికి దించిన సహచరులు ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. సోని తన స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు, ఇద్దరి మధ్య వివాదంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.