వికారాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లగచర్ల ఘటనలో అమాయక గిరిజనులకు జాతీయ ఎస్టీ కమిషన్ అండగా నిలిచింది. అధికారులపై తిరగబడిన ఘటన అనంతరం గిరిజన మహిళలు, వృద్ధులు, చిన్నారులపై పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌కు గిరిజన మహిళలు తమ గోడును తెలిపారు. ఘటనా స్థలంలో లేనివాళ్లను పోలీసులు తీసుకెళ్లారని, పోలీసుల భయానికి తండాల్లో మగవాళ్లు లేకుండా తండాలను వదిలి వెళ్లారని, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని, వారం రోజులుగా తండాల్లో చిన్నపిల్లలను అక్కున చేర్చుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నట్లు తెలిపారు.
ఎప్పుడు, ఎవరు వస్తారో, ఏం జరుగుతుందోనన్న భయంతో తిండి, నిద్రలు మానేసి బతుకుతున్నామని కమిషన్ సభ్యుడికి వెల్లడించారు. ఎంసెట్‌లో సీటు వచ్చినా ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో చదువులకు దూరం అవుతున్నట్లు తండాలకు చెందిన విద్యార్థులు ధైర్యంగా ఎస్టీ కమిషన్ సభ్యుడికి తెలిపారు. వారి గోడును విన్న జాటోతు హుస్సేన్ ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. అర్ధరాత్రి అమానవీయంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు చేసిన అరెస్టులు చాలని, ఇకపై అరెస్టులు చేయొద్దని, అరెస్ట్‌లు ఆపకపోతే కమిషన్పరంగా చర్యలుంటాయని ఆయన పోలీసులను హెచ్చరించారు. భూ సేకరణ విషయంలో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ప్రజాభిప్రాయాలను గుర్తించి నచ్చజెప్పేలా ముందుకెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, ఎన్నో ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న వారు భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేరనేది స్పష్టమవుతున్నదని, ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని, బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేయవద్దని ఎస్టీ కమిషన్ సభ్యుడు సూచించారు.
ఆగని పోలీసుల ఓవరాక్షన్..
లగచర్ల ఘటన అనంతరం అర్ధరాత్రి దాడి చేసిన వారి కోసం గాలింపు చేపట్టి తండాల్లోని గిరిజన మహిళలు, వృద్ధులు, చిన్నారులను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు ఇంకా అమాయక గిరిజనుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. లగచర్ల ఘటన అనంతరం లగచర్లతోపాటు రోటిబండతండా, పులిచర్ల తండాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటన సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలంతటా పోలీసులు భారీగా మొహరించారు. లగచర్ల వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు రెండు, మూడు గంటలపాటు మీడియా వాహనాలతోపాటు ఎవరి వాహనాలనూ లగచర్లకు అనుమతివ్వకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. లగచర్ల గ్రామం మొత్తాన్ని పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ దిగ్బంధించారు. గిరిజనులకు అండగా నిలిచేందుకు వస్తున్నారనే సమాచారంతో జిల్లావ్యాప్తంగా గిరిజన నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి వెంట ఎస్పీతోపాటు నలుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, డజనుకుపైగా ఎస్‌ఐలతోపాటు భారీ మొత్తంలో పోలీసులు లగచర్లకు వచ్చారు. మరోవైపు లగచర్ల ఘటనలో పోలీసుల వైఫల్యంపై అధికారులపై వేటు మొదలైంది.