మొయినాబాద్ : గణితంలో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గురుకుల విద్యా సంస్థల హైదరాబాద్-రంగారెడ్డి పశ్చిమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారదావెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల బాలికల స్వచ్ఛ పాఠశాల/కళాశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు 70 గణిత నమూనాలను ప్రదర్శించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంఈవో సయ్యద్ అక్బర్, కళాశాల ప్రిన్సిపాల్ డి రమాదేవి, బంట్వారం పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : గణితంపట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తి పెంపొందిస్తే ఎన్నో అద్భుతాలు సాధించటానికి అవకాశం ఉంటుందని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సహజంగా విద్యార్థుల్లో గణితం పట్ల భయం నెలకొని ఉంటుందని, ఆ భయాన్ని పోగొట్టి సులభరీతిలో గణితంలోని ఫార్ములాను బోధిస్తే భయాన్ని పూర్తిగా పొగొట్టవచ్చునని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సురేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణిత ప్రదర్శనలో సుమారు 60 మంది విద్యార్థులు తాము తయారుచేసిన పలు ప్రయోగాలను ఇందులో ప్రదర్శించారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం ఉన్నత పాఠశాలలో క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.
చేవెళ్ల రూరల్ : విద్యార్థులు గణిత బోధనకు సంబంధించిన ప్రదర్శలు, క్విజ్, గణిత ఉపన్యాస, నృత్య పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్ కుమార్, గణిత ఉపాధ్యాయురాలు హనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేష్మ, సరిత, ఉష, మాణిక్యరావు, విద్యార్థులు, స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల కేంద్రంతో పాటు ఖానాపూర్లోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకరయ్య, ఎస్ఎంసీ చైర్మన్ జగన్, శారదాదేవి, కర్ణారెడ్డి, గోపాల్, బాలస్వామి, సతీశ్, మల్లేశ్, శం కర్, స్వాతి పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీనివాస రామానుజన్‌ను జయంతిని గురువారం నిర్వహించారు. ప్రతి విద్యార్థి గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గణిత పొటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు.
కేశంపేట : గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కేశంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, ఉపన్యాసంతో పాటు గణిత సంకేతాలను, చిహ్నాలను, అంకెలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈవో మనోహర్, జీహెచ్ఎం రసూల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : విద్యార్థులు గణితంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని చేవెళ్ల తెలంగాణ ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ టీనావతి తెలిపారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వివిధ రకాల గణిత నమూనాలను తయారు చేశారు. గత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు చెక్కుల రూపంలో నగదు పురస్కారాలు అందజేసినట్లు ప్రిన్సిపాల్ టీనావతి తెలిపారు. దేవుని ఎర్రవల్లి, కందవాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, రేవతి, కృష్ణ, జ్యోతి, పద్మిని, వీరయ్య, మంజుల, రజిత,విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఆమనగల్లు : పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో శ్రీనివాస రామానుజన్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుమన్, మండల అధ్యక్షుడు కల్యాణ్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యదర్శి శివకుమార్, పాఠశాల ఎస్వో పద్మజ్యోతి, ఉపాధ్యాయులు సునీత, ధనలక్ష్మి, శోభ, వసంత, సువర్ణ, యాదమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు