బొంరాస్‌పేట, డిసెంబర్ 2 : విధి ఆ బాలుడికి వింత రాత రాసింది. తల్లిదండ్రులకు కొడుకు పుట్టాడన్న సంతోషమే కానీ ఎలా సాకాలన్న ఆవేదన లోలోన కుంగదీసేది. రెండు చేతులు లేకుండా పుట్టినా ఎంతో ప్రేమతో పెంచుతూ చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కాళ్లతో పెన్నుపట్టుకుని రాస్తూ చదువులో రాణిస్తున్నాడు శ్రీకర్.
బొంరాస్‌పేట మండలం బాపల్లితండా గ్రామానికి చెందిన మంగ్యానాయక్, సుశీల దంపతులకు 2004 మార్చి 18వ తేదీన మొదటి సంతానంగా జన్మించాడు శ్రీకర్. పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా పుట్టిన బాబును చిన్నతనంలోనే వదిలించుకోవాలనుకున్నారు. కానీ జన్మనిచ్చిన తల్లి సుశీలాబాయి అడ్డుకున్నది. ఇరుగు పొరుగు వారికి విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ఆనాటి నుంచి శ్రీకర్‌ను తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. బడీడు వచ్చిన తరువాత పాఠశాలలో చేర్పించారు.
రెండు చేతులు లేకున్నా రెండు కాళ్లనే చేతులుగా మార్చుకుని విద్యభ్యాసాన్ని కొనసాగించాడు. కాలి వేళ్ల మధ్య బలపం పట్టుకుని పలకపై ఒనమాలు దిద్ది ప్రస్తుతం పెన్నుతో రాయడం, పెన్సిలు పట్టి బొమ్మలు గీయడం దాకా ఎంతో ఓర్పుతో, నేర్పుతో చదువును కొనసాగిస్తున్నాడు. రెండు కాలి వేళ్లతో చెంచాను పట్టుకుని భోజనం చేయడం, చేతులు లేకున్నా తోటి విద్యార్థులతో ఆటలు ఆడడం మొదలు పెట్టాడు. పదో తరగతి, ఇంటర్ వరకు పట్టుదలతో చదివిన శ్రీకర్ ప్రస్తుతం పరిగి పట్టణంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకోవాలన్న ఉత్సాహం, ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు శ్రీకర్‌కు అడ్డుచెప్పకుండా చదివిస్తున్నారు.
జీవితంలో స్థిరపడాలని ఉన్నది..
రెండు చేతులు లేకున్నా పదో తరగతి, ఇంటర్ వరకు పట్టుదలతో చదివా. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి గొప్ప స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక.
–శ్రీకర్