యాచారం, మార్చి 21: రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండల కేంద్రంలో అత్యంత ఎత్తయిన గుట్టపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే ఆలయం ముస్తాబైంది. అతి పురాతనమైన శ్రీవారి ఆలయం విద్యుత్ కాంతులీనుతుంది. మూడురోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సం, రథోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు మండల కేంద్రంలోని 200 ఏండ్ల నాటి శ్రీ తిరుమలనాథ ఆలయం ముస్తాబైంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామివారికి ఏటా ఉత్సవాలు జరుగుతుంటాయి.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
స్వామివారి పూజ కార్యక్రమాలు పూజారి హరిబాబు పర్యవేక్షణలో జరగనున్నాయి. 21న సాయం త్రం 6 గంటలకు యాచారం గ్రామంలోని ఆం జనేయ స్వామి ఆలయం నుంచి ఉత్సహ మూర్తుల విగ్రహాలను శోభాయాత్రగా కొండపైకి ప్రవేశం, హారతి, ప్రసాద వితరణ. 22న ఉదయం 11 గంటలకు శ్రీ పద్మావతి అలివేలు మంగ శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్స వం. మధ్యాహ్నం అన్నదానం. 23న ఉదయం 7 గంటలకు రథోత్సవం, పూజా, హోమం, కుంభహారతి. ఉదయం 11.30 గంటల నుంచి ఉత్సవ విగ్రహాలను గ్రామంలోకి ప్రవేశం. అనంతరం వనం మైసమ్మ వద్ద వన భోజనాలు.
ఉత్సవాలకు ఇలా చేరుకోచ్చు
మహానగరం నుంచి రావాల్సిన భక్తులు సాగర్రింగ్ రోడ్డు నుంచి దేవరకొండ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి యాచారంలో దిగాలి. నల్లగొండ జిల్లా నుంచి వచ్చే వారు దేవరకొండ, మాల్ నుంచి వచ్చే బస్సుల్లో యాచారానికి చేరుకోవాలి. మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చే వారు శ్రీశైలం రహదారిపై వచ్చి, కందుకూరు గేట్ వద్ద దిగి, అక్కడి నుంచి 25 కి.మీ. దూరంలో ఉన్న యాచారం చేరుకోవాలి.