వికారాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నేరాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన నేరాల్లో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి, పెండింగ్ నేరాల శాతాన్ని తగ్గించాలని, అన్ని పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్‌ను ముమ్మరంగా చేపట్టాలని.. రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి చోరీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో శాంతియుత వాతావరణం ఉన్నదని.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగడంలేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని నేరాలపై అవగాహన కల్పించేందుకు కళాబృందాల ద్వారా సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా పనితీరును మెరుగుపర్చుకుంటామని, 12 వర్టికల్లో ముందు వరుసలో ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం ఆయన 12 వర్టికల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి రివార్డులను అందజేసి.. ఇక ముందు కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్, అయ్యప్ప, ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఆర్ఐ రత్నం పాల్గొన్నారు.